బెంగుళూర్‌లో మళ్లీ 40కోట్ల సీజ్‌

ఇటీవల 42కోట్లు పట్టుబడిన ఘటన మరువక ముందే మళ్లీ భారీగా నగదు పట్టుబడింది. రాజాజీ నగర్ కేటమారనహళ్లిలోని బిల్డర్ అపార్ట్‌మెంట్‌లో సోదాల్లో 40కోట్లు పట్టుబడ్డాయి.

బెంగుళూర్‌లో మళ్లీ 40కోట్ల సీజ్‌
  • నల్లగొండలో 3.4కోట్ల పట్టివేత

విధాత : ఇటీవల బెంగుళూర్‌లో 42కోట్లు పట్టుబడిన ఘటన మరువక ముందే ఐటీ అధికారు దాడుల్లో మళ్లీ భారీగా నగదు పట్టుబడింది. రాజాజీ నగర్ కేటమారనహళ్లిలోని బిల్డర్ అపార్ట్‌మెంట్‌లో ఐటీ అధికారుల సోదాల్లో 40కోట్లు పట్టుబడ్డాయి. ఈ డబ్బు కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఉద్ధేశించిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ-వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ధ 3.04కోట్ల నగదు పట్టుబడింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద ఎస్ఐ, సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా ఒక తెలుపు రంగు కారు ఆపకుండా వెళ్ళగా ఇదే విషయాన్ని మాడుగులపల్లి పోలీసులు రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న మిర్యాలగూడ డియస్పీకి తెలిపి అప్రమత్తం చేశారు.

వారు ఈదులుగూడ సిగ్నల్‌ వద్ద ఆపడానికి ప్రయత్నించగా సదరు వాహనం ఆపకుండా వెళ్ళగా వాడపల్లిలోని అంతర్రాష్ట్ర సమీకృత చెక్‌పోస్టు సిబ్బందిని మళ్లీ అప్రమత్తం చేశారు. అక్కడ ఎస్‌ఐలు రవికుమార్‌, క్రాంతికుమార్‌ బృందాలు బారికేడ్‌లు వేసి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. వారిని విచారించి వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలోని సీటు క్రింది భాగంలో రహస్య గదులు తయారు చేసుకొని అందులో రూ.3.04 కోట్ల అక్రమంగా డబ్బు దాచినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానితులలో గుజరాత్‌కు చెందిన డ్రైవర్ విపుల్ కుమార్ భాయి , అమర్‌సిన్హ్ జాలాలుగా గుర్తించారు.

నిందితులపై ర్యాష్ డ్రైవింగ్, హైవేపై ప్రయాణీకుడికి ప్రమాదం కలిగించడం, తనిఖీ చేసే పోలీసు అధికారికి విధేయత చూపకపోవడం, వాహనం యొక్క రూపం మార్చి ప్రత్యేకమైన చాంబర్ ఏర్పాటు చేసినందుకు సెక్షన్ 336 ఐపీసీ, ఎంవి యాక్ట్ ఆఫ్ 179, 52/177, 102 సీఆర్పీ కింద కేసు నమోదు చేశారు. ఈ చేజింగ్‌లో మిర్యాలగూడ డిఎస్పీ పి.వెంకటగిరి ఆద్వర్యంలోని ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, సత్యనారాయణ, ఎస్ఐలు రవికుమార్, క్రాంతికుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అపూర్వరావు అభినందించారు. ఎన్నికల కోడ్ వచ్చాకా ఇప్పటి వరకు 2,800 మందిని బైండోవర్ చేయడం జరిగిందని, ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లఘించి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే డయల్ 100 గాని, సంబందిత పోలీసు అదికారులకు తెలియ పరచాలన్నారు. ఎన్నికల కోడ్ నేపధ్యంలో జిల్లా పోలీసు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.7.39 కోట్ల నగదు, రూ.40 లక్షల విలువగల మద్యం, రూ.1.71 కోట్ల విలువ గల గంజాయి, రూ.80 లక్షల విలువ గల బంగారం పట్టుకున్నామని ఆమె తెలిపారు.