Kukatpally Murder Case | క్రికెట్ బ్యాట్ చోరీకి వెళ్లి…బాలికను హత్య చేశాడు : సీపీ అవినాష్ మొహంతి

క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పక్కింటి బాలిక సహస్ర(10)ను 14 ఏళ్ల బాలుడు హత్య, కేసు వివరణలో ఆశ్చర్యకరమైన వివరాలు.

Kukatpally Murder Case | క్రికెట్ బ్యాట్ చోరీకి వెళ్లి…బాలికను హత్య చేశాడు : సీపీ అవినాష్ మొహంతి

Kukatpally Murder Case | విధాత, హైదరాబాద్ : కూకట్ పల్లి సంగీత నగర్ లో బాలిక సహస్ర(10)ను హత్య చేసింది పక్కింటి పదో తరగతి చదువుతున్న బాలుడు(14) గా తేలిందని సీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. శనివారం మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ ను దొంగతనం చేసేందుకు వచ్చి..ఇంట్లో ఉన్న బాలిక చూడటంతోనే ఆమెను హత్య చేశాడని తెలిపారు. నెల రోజుల ముందునుంచే చోరీకి ప్లాన్ వేసుకున్నాడని కేసు వివరాలను వెల్లడించారు. బాలిక ఇల్లు, నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో గోడ మీదుగా ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడినట్లుగా వివరించారు.

సంగారెడ్డి జిల్లా ముక్తాక్యాసారానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సహస్ర(10), కుమారుడు(8) సంతానం. సహస్ర బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతోంది. ఈ నెల 18న ఉదయం కృష్ణ, రేణుక పనులకు, కుమారుడు సమీపంలోని బడికి వెళ్లాడు. పాఠశాలకు సెలవు కావడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. కుమారుడికి లంచ్‌బాక్సు ఇచ్చేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి.. కుమార్తె హత్యకు గురవ్వడం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలలో కూడా ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో పోలీసులు కేసును సవాల్ తీసుకున్నారు. 300మందికి పైగా ప్రశ్నించారు. ఈ క్రమంలో నిందితుడైన బాలుడిని సైతం ప్రశ్నించగా..అతను తనకేమి తెలియనట్లుగా విచారణను తప్పుదోవ పట్టించాడు. అయితే హత్య జరిగిన రోజు ఓ బాలుడు పక్క బిల్డింగ్ భవనం గోడ దూకి అపార్ట్ మెంట్ లోకి వస్తుండటాన్ని గమనించిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అందించిన సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా అతను నేరాన్ని ఒప్పుకున్నాడు.

బ్యాట్ కోసం నెల రోజుల ముందే చోరీ ప్లాన్

బాలిక సహస్ర తమ్ముడి క్రికెట్ బ్యాట్ నిందితుడైన బాలుడికి నచ్చడంతో అది నాకు ఇవ్వాలని అతడితో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఎలాగైనా ఆ బ్యాట్ ను దొంగిలించాలని నెల రోజుల ముందే నిందితుడు ప్లాన్ చేసుకున్నాడు. బ్యాట్ దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్ లో రాసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేరనుకుని దొంగతనానికి వెళ్లాడు. ఇంటి తాళం తెరిచేందుకు కిచెన్ లోని కత్తిని వెంట తీసుకెళ్లాడు. తమ అపార్ట్‌మెంట్‌ పైనుంచి, పక్కనున్న భవనం పెంట్‌హౌస్‌ మీదికి దూకాడు. ఒంటరిగా ఉన్న బాలిక సహస్ర తలుపులు దగ్గరికి వేసుకుని, లోపల టీవీ చూస్తూ ఉండటాన్ని గమనించాడు. తలుపులు తోసుకుని రహస్యంగా లోపలికి వెళ్లాడు. అయితే బ్యాట్ తీసుకుని వెలుతుండగా.. అలికిడికి ఇంట్లో టీవి చూస్తున్న బాలిక గమనించి దొంగా దొంగా అంటూ అరిచింది. పారిపోతున్న అతడి చొక్కా పట్టుకుంది. విషయాన్ని అమ్మనాన్నలకు చెబుతానంటూ కేకలు వేసింది. కంగారు పడిన నిందితుడు బాలికను బెడ్ రూమ్ లోకి తోసేసి కళ్ళు మూసుకొని జేబులో ఉన్న కత్తి తీసి ఆమె గొంతులో పొడిచాడు. ఆమె చనిపోయిందో లేదనుకుని బాలికపై కూర్చుని అదే పనిగా విచక్షణ రహితంగా పొడిచాడు. బాలిక చనిపోయాక కత్తిని కిచెన్ లో కడిగేసి..ఇంట్లో ఉన్న హుండీని పగులగొట్టి అందులోని నగదు తీసుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.

తన ఇంటికి వెళ్లిన సమయంలో నిందితుడి తల్లిదండ్రులు టీవీ చూస్తుండగా..చప్పుడు కాకుండా వెళ్లి కత్తిని రిఫ్రిజిరేటర్ పై పెట్టి..రక్తపు మరకల డ్రెస్ ను వాషింగ్ మెషిన్ లో వేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిపై అనుమానంతో ప్రశ్నించామని..తొలుత విషయం దాచిపెట్టి విచారణను తప్పుదోవ పట్టించాడని..అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజం అంగీకరించాడని సీపీ వెల్లడించారు. నిందితుడికి ఓటీటీలో క్రైమ్ స్టోరీలు, సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని విచారణలో గుర్తించామని సీపీ తెలిపారు. హత్యకు వాడిన కత్తిని, దొంగతనానికి సంబంధించిన ముందస్తు ప్లాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని.. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు దొరికాయని సీపీ వివరించారు. కాగా నిందితుడు ఇటీవల బాలిక బర్త్ డే కు కూడా వెళ్లి కేక్ తినిపించి శుభాకాంక్షలు కూడా చెప్పాడని..కేక్ తినిపించిన చేతితోనే చంపేశాడన్నారు. బాలుడిపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చినప్పటికి ప్రామిస్ లు చేసి వారి దృష్టి మళ్లించాడని.. నిందితుడు మైనర్ కావడంత జువైనల్ కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోంకు తరలించినట్లుగా పేర్కొన్నారు.