విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోమవారం రాత్రి 8వ తరగతికి చెందిన విద్యార్థి సెల్ ఫోన్ మాట్లాడడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే వారు వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేసే క్రమంలో 8వ తరగతి బాలికలు ఇద్దరు, 9వ తరగతి చెందిన మరో బాలిక కనిపించలేదు.
దీంతో వారి గదిలో ఉండే విద్యార్థులను ఆరా తీయగా ఉదయం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు.
విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారనే విషయంలో బంధువులు ,స్నేహితులను ఆరాతీసినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు.పోలీసులు కిడ్నాప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.