Dharmasthala Files | ధర్మస్థల ఖననాల కేసు : సిట్‌ మధ్యంతర నివేదిక లేనట్టే!

  • By: TAAZ    crime    Aug 17, 2025 8:50 PM IST
Dharmasthala Files | ధర్మస్థల ఖననాల కేసు : సిట్‌ మధ్యంతర నివేదిక లేనట్టే!

Dharmasthala Files | ధర్మస్థలలో దశాబ్దం క్రితం జరిగినట్టు చెబుతున్న సామూహిక ఖననాలపై దర్యాప్తు జరుపుతున్న స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) తన మధ్యతర నివేదికను ఇచ్చే అవకాశం లేదని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. సిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు మేరకు ప్రతి రోజూ దర్యాప్తులో పురోగతిని డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (DG-IGP) ఎంఏ సలీమ్‌కు నివేదిస్తూ వచ్చామని సిట్‌ వర్గాలు తెలిపాయి. ధర్మస్థలలో తాను పనిచేసిన కాలంలో తన చేత బలవంతంగా శవాలను ఖననం చేయించారని మాజీ పారిశుధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అనేక మృతదేహాలపై గాయాలు, లైంగిక దాడి ఆనవాళ్లు, గొంతు పిసికిన ఆనవాళ్లు ఉన్నాయని సైతం అతడు చెప్పాడు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న సిట్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ సాక్షి చెప్పిన 17 లొకేషన్లలో సిట్‌ అధికారులు తవ్వకాలు నిర్వహించినప్పటికీ.. రెండు చోట్ల మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. అందులో ఒకటి పురుషుడిగా తేలింది. మరో మృతదేహం పురుషుడిదా? మహిళదా? అన్న విషయం తేల్చలేదు. బాహుబలి బెట్ట సమీపంలో అనేక మృతదేహాలను తాను పూడ్చి పెట్టానని సాక్షి చెబుతున్న నేపథ్యంలో అక్కడా సిట్‌ అధికారులు తవ్వకాలు జరిపారు. అయితే.. ఒక చోట అప్పటికే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత భూమిని తవ్వి, మళ్లీ మట్టితో నింపేశారన్న వార్త సంచలనం సృష్టించింది. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ సిట్‌ దర్యాప్తులో పురోగతిపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

50 ఏళ్ల మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రణబ్‌ మహంతి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో వందల శవాలాను తాను పూడ్చి పెట్టానని ధర్మస్థల ఆలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన సాక్షి ఫిర్యాదు చేశాడు. తనచేత బలవంతంగా ఆ శవాలను ఖననం చేయించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్‌.. తుది నివేదికను డీజీ ఐజీపీ ద్వారా తమకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ధర్మస్థల పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ బాధ్యతలను స్వీకరించిన సిట్‌.. సాక్షి వాంగ్మూలాన్ని బెళ్తంగడి మెజిస్ట్రేట్‌ ఎదుట రికార్డ్‌ చేయించింది. ఫిర్యాదుదారుడు చెప్పిన 17 లొకేషన్లలో ఇప్పటి వరకూ సిట్‌ తవ్వకాలు చేయించింది. వాటిలో ఆరో లొకేషన్‌లో కొన్ని మానవ అవశేషాలు లభించాయి. అవి ఒక పురుషుడివిగా తేల్చారు. 14వ లొకేషన్‌లో కూడా కొన్ని ఎముకలు లభించినట్టు చెబుతున్నా.. అవి పురుషుడివా? లేక మహిళవా? అన్న విషయంలో స్పష్టత లేదు.

సామాజిక కార్యకర్త జయంత్‌.. 2002.. 2003 మధ్య అనుమానాస్పద రీతిలో చనిపోయిన పదిహేనేళ్ల బలిక మృతదేహాన్ని ఎలాంటి కేసు రిజిస్టర్‌ చేయకుండానే పోలీసులు ఖననం చేశారని ఆరోపించిన నేపథ్యంలో ఆ సైట్‌ను సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ ఖననంతోపాటు 1995 నుంచి 2014 మధ్య జరిగిన మరికొన్ని ఖననాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరిని సిట్‌ విచారించింది. ఆ ఖననాలకు సంబంధించి ధర్మస్థల గ్రామ పంచాయతీలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.