నోట్లో పేలుడుపదార్థంతో ప్రేయసి దారుణ హత్య – మైసూరులో ‘బ్లాస్టింగ్​’​ మర్డర్​

మైసూరు జిల్లాలోని ఒక లాడ్జ్‌లో 21 ఏళ్ల వివాహిత యువతి దారుణం హత్యకు గురైంది. నోట్లో పేలుడు పదార్థం పేల్చి హతమార్చినట్లు అనుమానం. ప్రియుడు సిద్ధరాజు అరెస్టు.

నోట్లో పేలుడుపదార్థంతో ప్రేయసి దారుణ హత్య – మైసూరులో ‘బ్లాస్టింగ్​’​ మర్డర్​

 మైసూరు జిల్లా భేరియా పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. 21 ఏళ్ల వివాహిత దర్షిత (కొన్ని రిపోర్టుల ప్రకారం రక్షిత) అనే యువతి, తన ప్రియుడు సిద్ధరాజుతో కలిసి లాడ్జ్‌లోకి వెళ్లి కొన్ని గంటలకే దారుణ స్థితిలో మృతదేహంగా బయటపడింది.

దారుణ హత్య ముఖాన్ని చిధ్రం చేసిన పేలుడు

లాడ్జ్ సిబ్బంది గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. దిగువ మొహం మొత్తం పేలిపోయి, తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో మృతదేహం కనిపించింది. మొదట మొబైల్ చార్జర్ పేలుడు కారణమని అనుమానం రేకెత్తించినా, పోలీసులు ఆ వాదనను ఖండించారు.

మైసూరు ఎస్పీ విష్ణువర్ధన స్పష్టంచేస్తూ – “ఎటువంటి జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లేదా బాంబులు లేవు. కానీ ఏదో రసాయన మిశ్రమం లేదా పౌడర్ వాడి పేలుడు జరిపినట్లు అనుమానం ఉంది” అని తెలిపారు.

ప్రియుడు సిద్ధరాజు అదుపులో

హున్సూరు తాలూకా గెరసనహళ్లికి చెందిన బాధితురాలు, కేరళలో పనిచేస్తున్న భర్తతో వివాహమై ఉండగా, బేట్టదపుర గ్రామానికి చెందిన 25 ఏళ్ల సిద్ధరాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ భేరియాలోని లాడ్జ్‌లో గది తీసుకుని ఉండగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగి, ఆవేశంలో సిద్ధరాజు  ఒక రకమైన పేలుడు పదార్థాన్ని బలవంతంగా ఆమె నోట్లో పెట్టి పేల్చాడని అనుమానం వ్యక్తమవుతోంది.

సంఘటన అనంతరం సిద్ధరాజు మొబైల్ చార్జర్ పేలుడు వల్లే మరణం జరిగిందని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే, స్థానికులు అతని ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కొనసాగుతున్న దర్యాప్తు

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు ఘటనాస్థలంలో నమూనాలను సేకరించారు. పేలుడుకు ఉపయోగించిన పదార్థం ఏదో తెలుసుకోవడానికి శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిద్ధరాజును సలిగ్రామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

“బాధితురాలికి వివాహమై ఉన్నప్పటికీ సిద్ధరాజుతో సంబంధం కొనసాగిస్తోంది. వివాదం అనంతరం ఆమె నోట్లోకి కెమికల్ మిశ్రమం బలవంతంగా పెట్టి హత్య చేశాడు. ఆ పదార్థం నమూనాలను ల్యాబ్‌కు పంపించాం” అని ఎస్పీ విష్ణువర్ధన వెల్లడించారు.ఈ ఘటనతో భేరియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.