విధాత:విజయవాడ లో రెమిడీసీవర్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఇన్ఫోర్మెంట్ అధికారి ఎస్. పి . కనకరాజు చెప్పారు. విజయవాడకు చెందిన టి. చిన కోటేశ్వరరావు, అల్లూరి శ్రీనివాస్ మరియు వై. సందేశ్ లు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఈనాడు బస్సు స్టాండ్ వద్ద రెమిడీసీవర్ ఇంజక్షన్ ఒక్కొక్కటి 40 వేల రూపాయలకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. ముగ్గురు నిందితులు విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ల్యాబ్ టెక్నిషన్స్ గా పనిచేస్తున్నట్లుగా తమ విచారణలో తేలిందన్నారు.
ఈజీ మనీ కి అలవాటు పడిన నిందితులు ముగ్గురు రెమిడీసీవర్ ఇంజెక్షన్లను అధిక రేట్లకు అమ్ముతున్నారన్నారు. వీరి వద్ద నుండి 8 రెమిడీసీవర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని కనకరాజు తెలియజేసారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్అసిస్టెంట్ డైరెక్టర్ రాజా భాను పర్యవేక్షణలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్, బాలు నాయక్, పోలీస్ ఇన్స్పెక్టర్, ఎం.అశోక్ మరియు ఇతర డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కూడిన బృందం డెకోయ్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిందని బృందం సభ్యులను కనకరాజు అభినందించారు. నిందితులపై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని కనకరాజు తెలియజేసారు.
కృష్ణా జిల్లాలో ఎక్కడైనా రెమిడీసీవర్ ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెటింగ్ లో విక్రయిస్తుంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఇన్ఫోర్మెంట్ అధికారి ఎస్. పి .కనకరాజు తెలియజేసారు.