అడ్డొస్తున్నాడ‌ని.. ప్రియుడితో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన భార్య‌

అడ్డొస్తున్నాడ‌ని.. ప్రియుడితో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన భార్య‌

వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నాడ‌నే ఉద్దేశంతో ప్రియుడితో భ‌ర్త‌ను భార్య హ‌త్య చేయించింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని దేవ‌ర‌క‌ద్ర మండ‌లంలో ఈ నెల ఒక‌టో తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.


దేవ‌ర‌క‌ద్ర మండ‌లం గురుకొండ‌కి చెందిన గుడుగు శ్రీనివాసులు(34) అక్టోబ‌ర్ 1వ తేదీన ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ స‌భ్యులు ఫోన్ చేయ‌గా, అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. దీంతో శ్రీనివాసులు సోద‌రుడు మ‌రిక‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


గురుకొండ‌కు చెందిన యామ‌న్నపై కుటుంబ స‌భ్యులు, పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. శ్రీనివాసులు భార్య‌, యామ‌న్న మ‌ధ్య గ‌త కొంత‌కాలం నుంచి వివాహేత‌ర సంబంధం కొన‌సాగుతోంది. దీంతో శ్రీనివాసులు త‌న భార్య‌ను హెచ్చ‌రించాడు. యామ‌న్న‌ను కూడా గ్రామ‌స్తులు హెచ్చ‌రించారు. అయినా వారిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు.


త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్న భ‌ర్త శ్రీనివాసులును హ‌త్య చేసేందుకు భార్య కుట్ర చేసింది. క‌ర్ణాట‌క రాయిచూర్ వెళ్లి బ‌ట్టలు తీసుకురావాల‌ని భ‌ర్త‌ను, ప్రియుడిని క‌లిపి పంపించింది. క‌ర్ణాట‌క‌లోని దేవ‌సుగూరు వ‌ద్ద కృష్ణా న‌ది ఒడ్డున శ్రీనివాసులును యామ‌న్న కొట్టి చంపాడు. అక్క‌డే మృత‌దేహాన్ని వ‌దిలేసి, యామ‌న్న గురుకొండ‌కు వ‌చ్చేశాడు. దీంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లి నిన్న మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం నారాయ‌ణ‌పేట జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.