Padmavathi Temple | తెప్పోత్సవాలకు సిద్ధమైన తిరుచానూరు..! ఐదురోజుల పాటు వేడుకగా ఉత్సవాలు..!
Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదురోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదురోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో నిత్యం అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. 17న మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.
అమ్మవారికి జూన్ 20న రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 21న రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను టీటీడీ రద్దు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.