Balkampet Yellamma | రేపే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. ఘనంగా ఏర్పాట్లు
హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణ మహోత్సం మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విధాత : హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణ మహోత్సం మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్.ఆర్.నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్దఎత్తున ఒగ్గు కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6గంటలకు పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు.
దీంతో కల్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం హైదరాబాద్ ప్రధాన మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి 80ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులు అన్నీ మూసివేశారు. వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఈ ఆంక్షలు 10వ తేదీ రాత్రి 8గంటల వరకూ ఉంటాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా గమ్యస్థానాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. గతేడాది సుమారు 10లక్షలమంది కార్యక్రమానికి రావడంతో ఈసారి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.