Sravana Somavaram | శ్రావణ సోమవారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా ?
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణం ఆధ్మాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే. సౌరమానం ప్రకారం హిందూ కేలండర్‌ను అనుసరించి శ్రావణం ఐదో నెల. ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన శ్రావణం శివారాధనకు ఎంతో శ్రేష్ఠమైంది

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం, పండుగల మాసం అంటారు. శ్రావణం ఆధ్మాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే. సౌరమానం ప్రకారం హిందూ కేలండర్‌ను అనుసరించి శ్రావణం ఐదో నెల. ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన శ్రావణం శివారాధనకు ఎంతో శ్రేష్ఠమైంది. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనది. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ నిత్య పూజలతో అలరారుతూ ఉంటుంది. ఆలయాలన్నీ భక్తులలో కిక్కిరిసిపోతాయి.. ప్రతి ఆలయం ప్రత్యేక పూజలతో, శివాలయాలు అభిషేకాలతో సందడిగా ఉంటాయి.
శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం కూడా ఇదే. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం (అంటే వినడం) మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందుకే శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెపుతారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రధాత ముక్కంటికి సోమవారం ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ మహాదేవుడికి అభిషేకాలు, అర్చనలతో పూజిస్తే సకల శుభాలు కలిగి సమస్త పాపాలు తొలుగుతాయని శాస్త్రం చెపుతోంది.
సనాతన ధర్మపరులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైంది. శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి, చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు పేర్కొన్నాయి. శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది. భక్తులు తమ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానంతరం శివాలయాలను దర్శించాలి. పాలు, జలంతో శివుడికి అభిషేకం చేసి ఓ నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. శ్రావణ మాసంలో సిద్ధిప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి. చన్నీటితో శుద్ధిచేసి పాలతో అభిషేకించాలి. బిల్వ పత్రాలు, విభూతి సమర్పించాలి. దగ్గర్లోని చెరువులు, నదులకు వెళ్లి చేపలకు ఆహారం వేయాలి. గోధుమ పిండితో తయారుచేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారం ఇవ్వడమంటే అంటే శివుడికి అందించినట్టే. మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. రోజూ 108 సార్లు జపించాలి. మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితుల వాక్కు.
వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కుంటూఉంటే కుంకుమపువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి. శ్రీఘ్రంగా వివాహం జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆవులు, గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.