Vinayaka Chavithi | వినాయ‌కుడికి కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు..?

Vinayaka Chavithi | వినాయ‌క చ‌వితి అన‌గానే కుడుములు( Kudumulu ), ఉండ్రాళ్లు( Undrallu ) గుర్తుకు వ‌స్తాయి. ఎందుకంటే గ‌ణేశ్ చ‌తుర్థి( Ganesh Chaturthi ) రోజున గ‌ణ‌నాథుడికి కుడుములు, ఉండ్రాళ్ల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. మ‌రి ఈ రెండింటిని ఎందుకు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారో తెలుసుకుందాం..

Vinayaka Chavithi | వినాయ‌కుడికి కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు..?

Vinayaka Chavithi | హిందూ సంప్ర‌దాయంలో ప్ర‌తి ప‌ర్వ‌దినం నాడు త‌ప్ప‌కుండా దేవుళ్ల‌కు నైవేద్యం స‌మ‌ర్పిస్తుంటారు. ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, ఆ దేవుడికి ఇష్ట‌మైన వంట‌కాన్ని నైవేద్యంగా స‌మ‌ర్పించి, ఆరాధిస్తాం. అయితే వినాయ‌కుడికి మాత్రం ప్ర‌త్యేకంగా కుడుములు( Kudumulu ), ఉండ్రాళ్ల‌( Undrallu )తోనే నైవేద్యం స‌మ‌ర్పిస్తుంటాం. ఈ నైవేద్యం వెనుకాల ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉన్న‌ట్లు పురాణాలు చెబుతున్నాయి.

‘లక్ష్యం లక్షప్రదో లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః లాసప్రియో లాస్యపరో లాభకృల్లోక విశ్రుతః॥’అంటుంది గణపతి సహస్రనామ స్తోత్రం. లోకఖ్యాతి గడించిన వినాయకుడిని ‘లడ్డుక ప్రియః’ అని గణేశ పురాణమూ చెబుతున్నది. అందుకే వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, మోదక్‌లతోపాటు లడ్డూలనూ నివేదనగా సమర్పిస్తార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

‘ముదాకరాత్త మోదకం, సదా విముక్తి సాధకం’ అని గణేశ పంచరత్న స్తోత్రంలో గజాననుడిని స్తుతించారు ఆదిశంకరాచార్యులు. ‘మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా!’ అని కీర్తించారు. గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి బాల గణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తుంటారు. గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. వారికి ఘనమైన అతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులు. ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి. ఎంత తిన్నా, బొజ్జ గణపయ్య ఆకలి తీరదు. అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది. అది తినగానే గ‌ణ‌నాథుడి క‌డుపు నిండి 21సార్లు త్రేన్చాడట! అప్పటినుంచి 21 కుడుములు, 21 ఉండ్రాళ్లు గణపతికి నైవేద్యంగా పెట్టి, ఒక్కోటి గణపతికి ఇచ్చి, పదేసి చొప్పున దానం చేసి, మిగతావాటిని ప్రసాదంగా తీసుకుంటారు. వినాయక మంటపాల్లో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి నైవేద్యం సమర్పించే ఆచారం ఉంది.