Telangana Endowments Department | దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి మోక్షం ఎప్పుడు?

తెలంగాణ దేవాదాయ శాఖలో 410 ఖాళీలు, నియామకంపై అనుమతుల సమస్య. కాంగ్రెస్ హామీ చేసిన ఉద్యోగాల భర్తీపై ఆసక్తి, విమర్శలు.

Telangana Endowments Department | దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి మోక్షం ఎప్పుడు?

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విధాత): అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. దేవాదావయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు అసాధ్యంగా కనిపిస్తుండటం ఆటంకంగా మారింది. విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీసు, ఆర్టీసీ వంటి విభాగాల్లో నెలకొన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేవాదాయశాఖలో ఖాళీల భర్తీ విషయంలో మాత్రం ముందడు పడటం లేదు. దీంతో దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయం తీసుకుంటున్న ప్రభుత్వం ఖాళీల భర్తీ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో విమర్శలపాలు అవుతోంది.

1454 పోస్టులకు గాను 410 ఖాళీలు

రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖలో వివిధ క్యాడర్ల కింద 1454 పోస్టులు మంజూరు ఉండగా వాటిలో 1043 పోస్టులలో పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 410 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిలో జాయింట్ కమిషనర్ క్యాడర్‌లో 302 పోస్టులు మంజూరు ఉంగా వాటిలో 178 మంది పని చేస్తుండగా 123 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ క్యాడర్‌లో 129 పస్టులు సాంక్షన్ అవ్వగా 103 మంది పని చేస్తున్నారు, వీటిలో ఇంకా 26 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్‌లో 216 పోస్టులు సాంక్షన్ అవ్వగా 171 మంది పని చేస్తుండగా 45 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6(ఏ) విభాగంలో పూర్తిగా 749 పోస్టులకు 584 మంది పని చేస్తుండగా 165 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6(బీ) విభాగంలో 37 పోస్టులకు గాను 5 గురు పని చేస్తుండగా 32 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. 6(సీ) విభాగంలో పూర్తిగా 21 స్థానాలు సాంక్షన్ అవ్వగా ఇద్దరు పని చేస్తుండగా మరో 19 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

జాయింట్ కమిషనర్ విభాగంలో స్థానాచార్య, ప్రధాన అర్చక, వేదపారాయణాదారులు, ఉప ప్రధాన అర్చక, అర్చక, పచక, అసిస్టెంట్ పచక, డోలు, సన్నాయి, శృతి, తాళం, సుప్రభాత గాయకులు, హార్మోనిస్టులు, మృదంగం, పరిచారకుల స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి.