ఫోక్ సాంగ్ లకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు ఇక్కడి జానపద కవి, గాయకులు. చివరకు సినిమా వాళ్లు కూడా తెలంగాణ ఫోక్ సాంగ్ లను పెడితే ఆ సినిమా హిట్టు అనే స్థాయికి ఫోక్ సాంగ్ క్రేజ్ ను పెంచేశారు. తెలంగాణ ఫోక్ సాంగ్ తో సత్తా చాటిన నాగదుర్గ తాజాగా ఇడుపు కాయితం పేరుతో నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా ఎంపికై సంచలనం రేపింది. దీంతో తెలంగాణ ఫోక్ సాంగ్ ప్రతిష్ట మరో మెట్టు ఎక్కినట్లయ్యింది.
ఇటీవల “చికెనే తెత్తడో నా అల్లుడు.. లేక మటనే తెత్తడో నా అల్లుడు.. బీరే తెత్తడో నా అల్లుడు లేక క్వార్టరే తెత్తడో నా అల్లుడు” నాగదుర్గ ఆడిన సాంగ్ సాధించిన ఆదరణ తెలిసిందే. అంతకుముందు ‘బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాప’ , తర్వాత ‘రాను బొంబాయికి రాను’ అనే పాట అందరిని స్టెప్పులేయించింది. ఆ తర్వాత ‘ఓ పిలగ యెంకటేశు పాట’, ‘పేరుగల్ల పెద్దిరెడ్డి, బాయిలోనా బల్లిపలికే పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రమీల సాంగ్, ఎర్ర ఎర్ర రుమాల్ గట్టి.. వంటి పాటలన్ని కూడా మిలియన్స్ వ్యూస్ సాధించి సత్తా చాటాయి.
తాజాగా బాసింగ బలాలు బలుగున్నాయే..ఫోక్ సాంగ్ రేపిన సందడి మరువకముందే మరో ఫోక్ సాంగ్ సోషల్ మీడియను షేక్ చేస్తుంది. ‘లగారే సౌండ్ సాల..దంచికొట్టు డీజే వాలా ’అంటూ సాగుతున్న కొత్త ఫోక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో దుమ్ము రేపుతూ..తెలంగాణ ఫోక్ సాంగ్స్ దమ్ము ఎంతో చూపిస్తుంది. ఈ పాటకు కూడా నాగదుర్గ తన డ్యాన్స్ తో మరింత ఊపు తెచ్చింది. తెలంగాణ పల్లెటూరి యాస, భాషలతో, మాస్ బీట్‌లతో ఫోక్ సాంగ్స్ ప్రాంతాలకు అతీతంగా సోషల్ మీడియాలో దూసుకపోతున్నాయి. ఎదో ఆడిపాడే చిందులేసే పాటలుగా కాకుండా సందేశాత్మకంగా ఫోక్ సాంగ్స్ రూపుదిద్దుకుంటుండటం అభినందనీయం.
నిజాం ప్రభువుల పాలన కాలం కంటే ముందు నుంచే తెలంగాణ పల్లెల్లో వినిపించే పల్లె పాటలు ఇప్పుడు జెన్ జీ తరాన్ని కూడా షేక్ చేస్తుండటం నిజంగా తెలంగాణ సంస్కృతి గొప్పతనంగా భావించవచ్చు. పనిలో నుంచి, సమకాలీన సమాజం నుంచి, రోజువారి జీవన శైలి నుంచి, జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, దావత్ లు, పెళ్లిళ్లు, పండుగల వంటి శుభకార్యాల నుంచి, పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన జానపద పాటలు ఎప్పటికప్పుడు కాలనుగుణంగా స్వీయమార్పులతో తరాల అంతరాలను చేధిస్తూ సంగీత ప్రియులను అలరిస్తుండటం నిజంగా అద్బుతం అనడంలో అతిశయోక్తి కాదేమో.
సరిగమలు శ్వాసగా సాగే శాస్త్రీయ సంగీతానికి, పాటలకు ధీటుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు లభిస్తున్న ఆదరణ వెనుక ఈ ప్రాంత కవి, గాయకులు, సంగీత దర్శకుల కృషి దాగి ఉండగా..ఫోక్ సాంగ్స్ కు లభిస్తున్న ఆదరణ వారికి దక్కుతున్న గౌరవంగా చెప్పవచ్చు.
తెలంగాణలో దుమ్ము రేపుతున్న మరో తెలంగాణ ఫోక్ సాంగ్ 🔥🔥
దంచి కొట్టు DJ వాలే 🔥🔥🔥 pic.twitter.com/cSOSwVajZJ
— TRPartyOfficial (@TRPartyOfficial) June 26, 2026