Nara Lokesh | హీరోగా నారా లోకేష్ ఎంట్రీకి ప్లాన్ చేశారా?.. వైరల్ అవుతున్న పాత కథనం!

Nara Lokesh | నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు, మనవళ్లు సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, మరోవైపు జానకీరామ్ కుమారుడు నందమూరి తారకరామారావు కూడా హీరోగా పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nara Lokesh | నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు, మనవళ్లు సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, మరోవైపు జానకీరామ్ కుమారుడు నందమూరి తారకరామారావు కూడా హీరోగా పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను కూడా ఒకప్పుడు హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేయాలని ప్రయత్నాలు జరిగాయనే వార్త నెట్టింట చర్చనీయాంశమైంది.

హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని అనుకున్నారా..

ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్.. తన తండ్రి చంద్ర‌బాబు నాయుడు వారసుడిగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా చేపట్టారు. భవిష్యత్తులో టీడీపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా లోకేష్ పేరు వినిపిస్తోంది.

అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయనను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన జరిగినట్లు ఇప్పుడు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా 2002 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో లోకేష్‌ను హీరోగా లాంచ్ చేయాలని ప్రయత్నాలు జరిగాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ సమయంలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’ వంటి భారీ విజయాలతో దర్శకుడు తేజ మంచి ఫామ్‌లో ఉన్నారు. కొత్త హీరోలను పరిచయం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో, చంద్రబాబు తనయుడిని కూడా ఆయన చేతుల మీదుగా పరిచయం చేయాలని భావించారట. ఈ మేరకు కథా చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

స్క్రీన్ టెస్ట్‌లు కూడా..

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను సిద్ధం చేశారని, లోకేష్‌పై స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించారని చెబుతున్నారు. అంతేకాకుండా డమ్మీ షూటింగ్ కూడా చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని అంటున్నారు.

మ‌రో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జ‌యం చిత్రం విడుదలై భారీ విజయం సాధించ‌గా, ఈ సినిమాని మొదట నారా లోకేష్‌తో చేయాలని భావించారనే ప్రచారం కూడా నడుస్తోంది. చివరికి ఆ ప్రాజెక్ట్‌లో నితిన్ హీరోగా నటించి స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో 2002లో సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి నిర్వహించిన ‘సంతోషం’ వారపత్రికలో వచ్చిన “ముఖ్యమంత్రి తనయుడు హీరోగా తేజ చిత్రం?” అనే కథనం ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాత మ్యాగజైన్ స్క్రీన్‌షాట్ చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు.

“లోకేష్ హీరో అయితే ఎలా ఉండేది?”, “తేజ దర్శకత్వంలో సినిమా వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

Latest News