Kurchi Thatha | కుర్చీ తాత కన్నుమూత.. ఒక్క డైలాగ్‌తో స్టార్‌గా మారిన మహ్మద్ పాషా ఇక లేరు

Kurchi Thatha | "కుర్చీ మడత పెట్టి" అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా ప్రపంచంలో సంచలనంగా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఆయన మరణ వార్త నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

  • By: Sandeep |    movies |    Published on : May 21, 2026 7:37 AM IST
Kurchi Thatha | కుర్చీ తాత కన్నుమూత.. ఒక్క డైలాగ్‌తో స్టార్‌గా మారిన మహ్మద్ పాషా ఇక లేరు

Kurchi Thatha | “కుర్చీ మడత పెట్టి” అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా ప్రపంచంలో సంచలనంగా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఆయన మరణ వార్త నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక వైరల్ డైలాగ్‌తో రాత్రికి రాత్రే గుర్తింపు తెచ్చుకున్న పాషా ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో విషాదాన్ని నింపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో కుటుంబంతో నివసిస్తున్న మహ్మద్ పాషా, యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద తరచూ కనిపించేవారు. ప్రతిరోజులాగే వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలబడలేకపోయారు.

మ‌ర‌ణానికి కార‌ణం..

అయితే ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణంపై ఇంకా స్పష్టత లేదు. వడదెబ్బ ప్రభావమా? లేక గుండెపోటా? అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు సమాచారం.

మహ్మద్ పాషాకు సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చిన సంఘటన కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒకసారి పార్క్ వద్ద ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయన చెప్పిన “కుర్చీ మడత పెట్టి…” అనే డైలాగ్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఆ ఒక్క మాటతోనే ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. మీమ్స్, షార్ట్ వీడియోలు, రీల్స్‌లో ఆయన డైలాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. అప్పటి నుంచి మహ్మద్ పాషా కంటే “కుర్చీ తాత” అనే పేరే ఎక్కువగా గుర్తింపు పొందింది.

ఆ డైలాగ్‌తో పాపుల‌ర్..

ఆ తర్వాత ఆయన పలు సోషల్ మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపించారు. అంతేకాదు, ఆయన డైలాగ్ సినీ ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో “కుర్చీ మడతపెట్టి” అనే పాటలో ఈ డైలాగ్ ప్రత్యేకంగా వినిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ సినిమాలో ఆ పాట భారీగా పాపులర్ అయింది. ఆ పాటలో మహేష్ బాబు, శ్రీలీల మాస్ డ్యాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే సంగీత దర్శకుడు థమన్, డైలాగ్ వినియోగానికి సంబంధించి మహ్మద్ పాషాకు కొంత ఆర్థిక సహాయం అందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వినోదానికి ప్రతీకగా మారిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా దూరం కావడం అభిమానులను కలచివేస్తోంది.

అభిమానుల నివాళులు..

కాగా, గతంలో కూడా కుర్చీ తాత మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో స్వయంగా మహ్మద్ పాషా, ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడు నిజంగానే కుర్చీ తాత మరణించడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, కంటెంట్ క్రియేటర్లు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఒక్క డైలాగ్‌తో లక్షలాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కుర్చీ తాత ప్రయాణం ఇక్కడితో ముగిసింది.