Jana nayagan | ‘జన నాయగన్’ లీక్ .. సినీ ఇండస్ట్రీ ఏకమై నిరసన, విజయ్ మాత్రం మౌనం!

Jananayagan | కోలీవుడ్ స్టార్, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ ఊహించని విధంగా ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ పరిశ్రమను కుదిపేసింది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 11, 2026 9:34 AM IST
Jana nayagan | ‘జన నాయగన్’ లీక్ .. సినీ ఇండస్ట్రీ ఏకమై నిరసన, విజయ్ మాత్రం మౌనం!

Jananayagan | కోలీవుడ్ స్టార్, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ ఊహించని విధంగా ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ పరిశ్రమను కుదిపేసింది. విడుదలకు ముందే పూర్తి సినిమా బయటకు రావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవైపు సెన్సార్ సర్టిఫికేట్ కోసం రివ్యూ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు సినిమా లీక్ కావడం నిర్మాతలకు భారీ దెబ్బగా మారింది.

ఈ ఘటనపై దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటై స్పందిస్తోంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘జన నాయగన్’ టీమ్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ వివాదంపై హీరో విజయ్ మాత్రం ఇప్పటివరకు స్పందించ‌క‌పోవ‌డం గమనార్హం. ఇటీవల ఎన్నికల ప్రచారం ముగించుకుని చెన్నై చేరుకున్న ఆయనను మీడియా ప్రశ్నించినా స్పందించకుండా మౌనంగా వెళ్లిపోయారు.

చిరు ఆందోళ‌న‌..

ఈ లీక్ వ్యవహారంపై ముందుగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, విడుదలకు ముందే సినిమా బయటకు రావడం ఆందోళన కలిగించిందని తెలిపారు. అనంతరం రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు, సూర్య, మంచు విష్ణు, విశాల్, కార్తీ, రాఘవ లారెన్స్, జీవీ ప్రకాష్ కుమార్, ప్రదీప్ రంగనాథన్, పా. రంజిత్, వెంకట్ ప్రభు తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కమల్ హాసన్ ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తూ, ఇది యాదృచ్ఛికం కాదని, సిస్టమ్ వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సెన్సార్ ప్రక్రియలో జాప్యం పైరసీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీ అనేది కళాకారులపై నేరమని, దీనిని కట్టడి చేయడానికి కఠిన చర్యలు అవసరమని అన్నారు.

బాధ్యుల‌ని శిక్షించాల‌న్న ర‌జ‌నీకాంత్..

ఇక రజినీకాంత్ మాట్లాడుతూ, ఈ ఘటన బాధాకరమని, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మోహన్ బాబు కూడా ఇది చిత్ర పరిశ్రమకు జరిగిన అపచారం అని పేర్కొన్నారు. సూర్య, కార్తీ అభిమానులను ఉద్దేశించి లీక్ అయిన వీడియోలను చూడకూడదని, షేర్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. విశాల్ తన అభిమాన దృక్కోణంలో స్పందిస్తూ, సినిమా థియేటర్లలో విడుదల కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తానికి, ‘జన నాయగన్’ లీక్ ఘటన దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. వందలాది మంది కష్టపడి తెరకెక్కించిన సినిమాలు ఇలా లీక్ కావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు కలుగుతున్నాయని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.