తెలంగాణ అగ్రిధార…దాశ‌ర‌థి జ‌యంతి నేడు

కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి "దాశరథి కృష్ణమాచార్య" జయంతి నేడు… ఆయన గురించి కొన్ని విషయాలు.. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ […]

తెలంగాణ అగ్రిధార…దాశ‌ర‌థి జ‌యంతి నేడు

కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి “దాశరథి కృష్ణమాచార్య” జయంతి నేడు… ఆయన గురించి కొన్ని విషయాలు..

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు వ్రాసారు.

‘చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలాన్నీ, నల్లని ఆకాశంలో కానరాని భానులను’ చూసిన ధీశక్తి దాశరథి కృష్ణమాచార్యుల సొంతం. చూడటానికి పీలగా, అంత ఎత్తు లేని దాశరథి మదిలో మాత్రం కొండలను పిండికొట్టగల ఆత్మవిశ్వాసం ఉండేది. ‘నిజాము రాజు బూజు’ను వదలించి, ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ను పలికించిన ధీశాలి దాశరథి. ‘అగ్నిధార’ కురిపించినా, ‘రుద్రవీణ’ వాయించినా, ‘తిమిరంతో సమరం’ చేసినా, ‘మహాంధ్రోదయం’ అభిలషించినా – ప్రతీ సందర్భంలోనూ దాశరథి తనదైన పదబంధాలతో సాహితీసేద్యం చేశారు. దాశరథి పండించిన సాహిత్యపు పంటలు తెలుగువారికి సంతృప్తి కలిగించాయి. ఆయన చిత్రసీమలో అడుగుపెడుతున్నారంటే, అభిమానుల ఆనందం అంబరమంటింది. మరెంతో మధురం తమ సొంతమవుతుందని దాశరథి అభిమానుల మది పులకించిపోయింది. అందుకు తగ్గట్టుగానే “ఖుషీ ఖుషీగా నవ్వుతూ…” దాశరథి కలం చిత్రసీమలో కాలు మోపింది. హుషారు పంచింది, బేజారును దూరం చేసింది. నిజాలను పలికించింది, జనం సజావుగా ఆలోచించేలా చేసింది. ఏది చేసినా దాశరథి కృష్ణమాచార్యుల గీతాలు తెలుగువారికి పరమానందం పంచాయని చెప్పక తప్పదు.

దాశరథి కృష్ణమాచార్య సంప్రదాయ కుటుంబంలో జన్మించినా, సమసమాజం కోసం తపించారు. ఛాందసం చుట్టూ ముసురుకున్నా, చైతన్యంతోనే సాగారు. వైష్ణవాన్ని ఒలికించారు, వైప్లవ్యం పలికించారు. దాంతో దాశరథి సాహిత్యంపై తెలుగునేలపైని ఎందరెందరో సాహితీప్రియులు మనసు పారేసుకున్నారు. అలాంటి వారందరికీ దాశరథి సాహిత్యం మదిలో వీణలు మ్రోగించింది. ఆ నాదం అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు మదినీ తాకింది. దాంతో తమ ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో ఓ పాట రాయమని, ఎర్రతివాచీ పరచి దాశరథిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆయన కలం పలికించిన తొలి సినిమా పాట, ‘ఇద్దరు మిత్రులు’లోని “ఖుషీ ఖుషీగా నవ్వుతూ…” అన్నదే! అయితే, ఆ తరువాత ఆచార్య ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దాశరథితో “నా కంటి పాపలో నిలచిపోరా…” పాట వ్రాయించారు. ‘ఇద్దరు మిత్రులు’ కంటే ‘వాగ్దానం’ ముందుగా జనాన్ని పలకిరించింది. ఆ పాటతోనే దాశరథి అభిమానగణం పులకించింది.

సినిమా రంగంలో దాశరథి కలం వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగింది. పేరులోనే కృష్ణ శబ్దం ఉన్నందున కాబోలు దాశరథి కన్నయ్య పాటలతో జనం మదిని దోచారు. వైష్ణవాన్ని పాటల్లో పలికిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు. దాశరథి పేరు వినగానే ఈ నాటికీ ఆయన కలం పలికించిన కృష్ణ భక్తిగీతాలనే ముందుగు స్మరించుకొనేవారు ఎందరో ఉన్నారు. “రా రా క్రిష్ణయ్యా…రా రా క్రిష్ణయ్యా…” అంటూ యన్టీఆర్ ‘రాము’లో సాగిన దాశరథి పాట ఇప్పటికీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ‘నాదీ ఆడజన్మే’లోని “కన్నయ్యా…నల్లని కన్నయ్యా…” అంటూ ఓ దీనురాలి ఆవేదనలో కురిసిన కృష్ణభక్తిని జనం మరచిపోలేరు. ఇక ‘బుద్ధిమంతుడు’లో దాశరథి కలం కన్నయ్యను పిలవడానికి “వేయి వేణువులు…” మోగించింది. భక్తి పారవశ్యం పొంగిపొరలేలా చేసింది. ‘మాతృదేవత’లో సన్నివేశానికి తగ్గట్టుగా కృష్ణప్రేమను చిలికించి పులకింప చేసింది దాశరథి కలం. అందులో “మనసే కోవెలగా…మమతలు మల్లెలుగా… నిన్నే కొలిచెదరా…కృష్ణా…” అంటూ సాగిన గానం మనసులను కోవెలలుగా మార్చివేయక మానదు.

“పాడెద నీ నామమే… గోపాలా…” అంటూ ‘అమాయకురాలు’ గానం చేసినా, ఆ పాటను పలికించిన దాశరథి కవితావైభవాన్ని మననం చేసుకోవలసిందే! కన్నయ్యపై కవిత్వం కట్టమంటేనే పరవశించిపోయే దాశరథి, ఆ కృష్ణయ్య నోటనే పాట పలికించాలంటే ఊరకుంటారా? ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామ కోపానికి తగ్గ గానవైద్యం చేసే సందర్భంలో కృష్ణుని నోట దాశరథి పాటను తలచుకుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించక మానదు. దాశరథి వైష్ణవులు కావడంతో విష్ణురూపాలకు తగ్గ ఏ పాట పలికించినా, అందులో భక్తిభావం తొణికిసలాడేది. రామయ్యను కొలిచినా, కృష్ణయ్యను తలచినా దాశరథి కలం సాగే తీరే వేరుగా ఉంటుంది. ‘రంగుల రాట్నం’లో “నడిరేయి ఏ జాములో…స్వామి నిను చేర దిగివచ్చునో…” పాటలో తిరుమలవాసుని కీర్తించారు. ఈ పాట ఈ నాటికీ తెలుగునేలను పరవశింప చేస్తూనే ఉంది. ‘పూజ’లో “నీ దయ రాదా… రామా…” అంటూ త్యాగయ్యనే తలపించారు. దాశరథి కలం నుండి జాలువారిన భక్తిగీతాలు ఈ నాటికీ భక్తకోటిని పరవశానికి లోను చేస్తూనే ఉన్నాయి.

ఆదుర్తి సుబ్బారావు చిత్రం ‘ఇద్దరు మిత్రులు’ కోసం తొలిసారి పాట రాయడం వల్ల ఆయన తన దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలకు దాశరథితో పాటలు రాయించారు. దాశరథికి ఆదుర్తి సుబ్బారావు సింగిల్ కార్డ్ వేయించలేకపోయినా, ఆయన పాటల్లోని పదబంధాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. సందర్భం ఏదైనా సరే అందుకు అనువుగా దాశరథి కలం సాగేది. కన్నీరు పెట్టించినా, పన్నీరు చల్లినా, చన్నీటిలో ఆటలాడినా – దాశరథి కలం తన శైలిని ప్రదర్శిస్తూ సాగింది. ఇక అనేక రీమేక్ మూవీస్ లో దాశరథి పాటలు హైలైట్ గా నిలిచేవి. ఒరిజినల్ లోని సందర్భమే తనకూ ఇచ్చినా, అందులో ఆత్మను చొప్పించడంలో దాశరథి తనదైన బాణీ ప్రదర్శించేవారు. అందుకే మూలంలోని పాట కంటే దాశరథి పలికించిన గీతమే మరింత మధురం అనిపించిన సందర్భాలు బోలెడున్నాయి. అలాంటి దాశరథి గీతాలను మననం చేసుకున్న ప్రతీసారి మధురం మన సొంతం కాక మానదు.

అవార్డులు:

1967 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి

1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి

ఆంధ్ర విశ్వవిద్యాలయం ” కళాప్రపూర్ణ “

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం “డి. లిట్ “

బిరుదులు:

కవిసింహం

అభ్యుదయ కవితా చక్రవర్తి

ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు

ఆంధ్రా కవితా సారధి

1987 నవంబరు 5 న దాశరథి మరణించారు.

భావితరాలను సైతం ప్రభావితం చేసే శక్తి దాశరథి సాహిత్యంలో దాగుంది. వెదకిన వారికి కోటి రతనాల వీణా నాదాలు వినిపిస్తాయి. వాటిని పదిల పరచుకున్న వారికి శతకోటి చైతన్య మార్గాలు కనిపిస్తాయి. అదీ దాశరథి సాహిత్యంలోని మహత్యం..