Headache | తలనొప్పి తగ్గాలంటే.. ఇవి చేయండి

Headache విధాత‌: తరచుగా తలనొప్పి వస్తోందా? మారిన మన జీవనశైలి తెచ్చిన ముప్పుల్లో ఈ తలనొప్పిని కూడా చేర్చవచ్చు. నిద్ర లేకపోవడం వల్లనో, అధిక ఒత్తిడి వల్లనో ఎక్కువ మందిలో తరచుగా కనిపించే తలనొప్పి వెనుక కొన్నిసార్లు వేరే కారణం కూడా ఉండొచ్చు. కానీ తలనొప్పి తగ్గుతుందేమో అనే భ్రమతో చాలామంది కప్పుల మీద కప్పులు టీలు తాగుతూ, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాలుస్తూ అవస్థ పడుతుంటారు. కానీ అలా చేస్తే ఉన్న తలనొప్పికి తోడు లేనిపోని […]

Headache | తలనొప్పి తగ్గాలంటే.. ఇవి చేయండి

Headache

విధాత‌: తరచుగా తలనొప్పి వస్తోందా? మారిన మన జీవనశైలి తెచ్చిన ముప్పుల్లో ఈ తలనొప్పిని కూడా చేర్చవచ్చు. నిద్ర లేకపోవడం వల్లనో, అధిక ఒత్తిడి వల్లనో ఎక్కువ మందిలో తరచుగా కనిపించే తలనొప్పి వెనుక కొన్నిసార్లు వేరే కారణం కూడా ఉండొచ్చు. కానీ తలనొప్పి తగ్గుతుందేమో అనే భ్రమతో చాలామంది కప్పుల మీద కప్పులు టీలు తాగుతూ, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాలుస్తూ అవస్థ పడుతుంటారు. కానీ అలా చేస్తే ఉన్న తలనొప్పికి తోడు లేనిపోని సమస్యలు నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. అసలు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో నిపుణులు ఏమని చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

కాఫీ, టీ లు వద్దు

తలనొప్పిగా ఉన్నప్పుడు లైట్ ని చూస్తే మరింత బాధగా ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్‌ లాంటి తలనొప్పితో బాధపడేవాళ్లు కొంచెం వెలుతురును కూడా భరించలేరు. కొంచెంగా ఉన్న తలనొప్పి కాంతిని చూడగానే మరింత ఎక్కువ అవుతుంది. టీవీలో సౌండ్‌ గానీ, గదిలో వేసిన లైట్‌ గానీ, చివరికి మొబైల్‌ సౌండ్‌ కూడా తలనొప్పిని ప్రేరేపిస్తాయి. అందుకే ఎక్కువ శబ్దం, కాంతి లేకుండా చూసుకోండి. మొబైల్‌ కి దూరంగా ఉండండి. వీలైతే సైలెంటులోనో, స్విచాఫ్‌ నో చేయండి.

ఇకపోతే తలనొప్పి తగ్గుతుందేమో అనే అపోహతో టీ, కాఫీలను తాగేస్తుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేట్‌ అయిపోయి, తలనొప్పి ఇంకా పెరుగుతుంది. నిజానికి తలనొప్పి ఉన్నప్పుడు చాక్లెట్లు, కెఫీన్ ఎక్కువగా ఉండే ఏ పదార్థాలనైనా తీసుకోవడం మానేయాలి. కెఫీన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి.

సంగీతం ఔషధమే!

మన శరీరానికి పడని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి ట్రిగ్గర్‌ అవుతుంది. అందువల్ల తరచుగా తలనొప్పి వచ్చేవాళ్లు వీటిని మానేయాలి. మైగ్రేన్‌ ఉన్నవాళ్లు మద్యం ముట్టుకుంటే తలనొప్పిని కొనితెచ్చుకున్నట్టే. అందుకే ఆల్కహాల్, సిగరెట్ల జోలికి వెళ్లవద్దు. కొన్ని పర్ ఫ్యూమ్ లు, డియోడరెంట్ల వల్ల కూడా తలనొప్పి రావొచ్చు. అందుకే తలనొప్పి ఉన్నప్పుడు ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. గందరగోళం ఉన్న శబ్దాల చోట ఉండకుండా ప్రశాంతమైన పరిసరాల్లో ఉండే ప్రయత్నం చేయాలి. మంద్రస్థాయిలో ఉండే సంగీతాన్ని చిన్న సౌండ్‌ పెట్టుకుని వింటే కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

కళ్లు జాగ్రత్త!

తలనొప్పి తరచుగా వచ్చే వాళ్లు కంటిని ఒత్తిడికి గురిచేసే పనులు చేయకూడదు. మసక వెలుతురులో చదవకూడదు. కుట్లు, అల్లికల పనులు చేసేవాళ్లు, కంప్యూటర్ పై పనిచేసేవాళ్లు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. ఎక్కువ సమయం కంప్యూటర్ తోనే పని ఉన్నవాళ్లు యాంటీ గ్లేర్ కళ్లజోడు ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ కావాలి. అదేపనిగా కనురెప్ప కొట్టకుండా స్క్రీన్ వైపు చూడకూడదు.

తలనొప్పితో పాటు ఈ లక్షణాలుంటే….

తలనొప్పి ఏముందిలే… ఏ నొప్పి బామ్‌ నో రాసుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటాం. కానీ తలనొప్పుల్లో చాలా రకాలుంటాయి. ఏ స్ట్రెస్ వల్లనో వచ్చే తలనొప్పి అయితే చిట్కాలు పనిచేస్తాయి. కానీ తలనొప్పి వెనుక ఒక్కోసారి బలమైన కారణం ఉండొచ్చు. పిల్లల్లో తలనొప్పి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ముందుగా కంటిచూపు పరీక్ష చేయించాలి.

తలనొప్పికి వేరే ప్రమాదకరమైన సమస్య కూడా కారణం కావొచ్చు. మెదడులో గడ్డలున్నా, ఇంకేవైనా సమస్యలున్నా కూడా అది తలనొప్పిగా కనిపించవచ్చు. అందుకే తలనొప్పి దీర్ఘకాలం వేధిస్తున్నా, తలనొప్పితో పాటుగా వాంతులు, తల తిరగడం లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.