Holi Colours | తస్మాత్‌ జాగ్రత్త.. హోలీ పండుగకు ఈ రంగులను అస్సలు వాడకండి..!

  • Publish Date - March 19, 2024 / 03:45 AM IST

Holi Colours : దేశమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ దగ్గరపడింది. ఈ హోలీ పండుగను చాలా మంది నార్త్‌ ఇండియన్స్ వారం రోజుల ముందు నుంచే సెలెబ్రేట్‌ చేసుకుంటుంటారు. ఈ రంగుల పండుగనాడు రంగులు చల్లుకోవడం, రంగురంగు నీళ్లలో తడవడాన్ని చాలా మంది ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ రంగుల పండుగ తెచ్చిపెట్టే సంతోషకర వాతావరణాన్ని కెమెకల్‌ కలర్స్‌ చెడగొడుతాయి. ఈ రసాయన రంగుల వల్ల చర్మ, కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారినపడి జీవితాలు దర్బరంగా మారే ప్రమాదం ఉంది. హోలీ అనేది రంగుల పండుగే గానీ రసాయనాలతో కూడిన రంగుల పండుగ కాదు. రసాయన రంగుల్లో ఉండే సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ లాంటి హానికర రసాయనాలు జీవితాలను విషాదంగా మారుస్తాయి. కాబట్టి రసాయన రంగులను దూరం పెట్టి, చక్కగా సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకోవడం ఉత్తమం. పసుపు, బీట్‌రూట్, బచ్చలికూర, రకరకాల పువ్వులను వినియోగించి తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించడం మేలు.

రసాయన రంగులు – హానికర ప్రభావాలు

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌ నగరంలోని సీకే బిర్లా హాస్పిటల్‌కు చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్ కన్సల్టెంట్‌ డాక్టర్ తుషార్ తాయల్ రసాయన రంగులతో కలిగే హానికర ప్రభావాల గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చర్మ సమస్యలు : రసాయన రంగులు పూసుకోవడం వల్ల చర్మంపై దురదలు వస్తాయి. ఇవి చికాకు కలిగిస్తాయి. కొంతమందిలో కెమికల్‌ కలర్స్ వల్ల చర్మం మొత్తం ఎర్రని మచ్చలు వస్తాయి. భరించలేని దురద, మంట పుట్టిస్తాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎక్కువగా ఈ చర్మ సమస్యల బారిన పడుతారు.

కంటి సమస్యలు : కెమికల్‌ కలర్స్ కళ్లకు కూడా చాలా ప్రమాదం. కళ్లలోకి రంగు పోతే కళ్లు ఎర్రగా మారి మంటలు పుట్టిస్తాయి. కొందరిలో కళ్ల వెంట నీరు కూడా కారుతుంది. కళ్లలో రంగు ఎక్కువగా పడితే అంధులుగా మారే ప్రమాదం కూడా ఉంది.

క్యాన్సర్ : రసాయన రంగుల్లో ఉండే సీసం, క్రోమియం లాంటి రసాయనాలు క్యాన్సర్ కారకమైనవి. తరచూ ఈ రసాయనాల ప్రభావానికి లోనయితే భవిష్యత్తులో చర్మ క్యాన్సర్ బారినపడే ప్రమాదం లేకపోలేదు.

శ్వాసకోశ సమస్యలు : రసాయన రంగులను చల్లుకోవడం వల్ల వాటి సూక్ష్మ కణాలు గాలిలో వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మ కణాలు మనం శ్వాస తీసుకున్నప్పుడు శ్వాసకోశంలోకి చేరుతాయి. దాంతో దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉబ్బసం లాంటి ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే దీర్ఘకాలికంగా శ్వాసకోశ సమస్యలను అనుభవించాల్సి వస్తుంది.

విష ప్రభావం : కెమికల్‌ కలర్స్‌ సీసం, పాదరసం, క్రోమియం, అమ్మోనియా లాంటి విష పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం ద్వారా శరీరంలో ప్రవేశిస్తాయి. గర్భిణిలు ఈ విషాల ప్రభావానికి లోనైతే సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డపై ఈ ప్రభావం పడుతుంది. పిండ వృద్ధి కూడా ప్రభావితం అవుతుంది.

పర్యావరణ కాలుష్యం : రసాయన రంగులు మానవ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అవి నీటి వనరులు, నేల, వృక్ష సంపదను కలుషితం చేస్తాయి. పర్యావరణ నష్టానికి దారితీస్తాయి. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తాయి.

సురక్షి హోలీకి చిట్కాలు

హోలీ పండుగ రోజు హానికరమైన రసాయన రంగుల ప్రభావానికి లోను కాకుండా సురక్షితంగా ఉండటం కోసం డాక్టర్ తాయల్ కొన్ని చిట్కాలను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • పువ్వులు, ఆకులు, కూరగాయలు వంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన మూలికా రంగులతో మాత్రమే హోలీ ఆడాలి.
  • హోలీ ఆడే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌ని పూసుకోవాలి.
  • రంగు పొడి నుంచి మీ కళ్లు, ముక్కును కప్పి ఉంచేలా సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ధరించాలి.
  • రంగులు చల్లుకుని ఉన్నప్పుడు కళ్లను, నోటిని చేతిలో తాకడం మానుకోవాలి.
  • హోలీ ఆడటం పూర్తయిన తర్వాత మీ జుట్టును, శరీరాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి.
  • హోలీ పండుగ తర్వాత చర్మంపై దురదలు, ఎరుపు మచ్చలు కనిపించినా, శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

Latest News