Colon Cancer In Young Adults |పేగులలో దాగి ఉన్న ముప్పు
కోలన్ క్యాన్సర్ ఇప్పుడు యువతలో వేగంగా పెరుగుతోంది. కారణం “కోలిబాక్టిన్” టాక్సిన్, ముందస్తు గుర్తింపు కోసం స్టూల్ టెస్ట్, ప్రోబయోటిక్స్ పరిశోధన.

పాతకాలంలో వృద్ధుల్లో మాత్రమే కనిపించే కోలన్ క్యాన్సర్ ఇప్పుడు యువతలో వేగంగా పెరుగుతోంది. 55 ఏళ్ల లోపు వయసులోనే ఈ వ్యాధి ఎందుకు అధికమవుతోంది? కొత్త పరిశోధన ఒక ఆశ్చర్యకర నిజాన్ని వెలికి తీసింది. ఈ పెరుగుదలకి ప్రధాన కారణం “కోలిబాక్టిన్” అనే విషపదార్థం. ఇది మన పేగులలో నివసించే ఇ.కోలి అనే బాక్టీరియా విడుదల చేసే టాక్సిన్. ఇది నేరుగా డీఎన్ఏను దెబ్బతీస్తుంది.
సూక్ష్మ శత్రువు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మంది కోలన్ క్యాన్సర్ రోగుల జన్యు డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని ధ్రువీకరించారు. 40 ఏళ్ల లోపు ఉన్నవారిలో కోలిబాక్టిన్ కు సంబంధించిన డీఎన్ఏ మ్యూటేషన్లు 70 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే 3.3 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఈ మార్పులు చాలా మందిలో జీవితపు మొదటి 10 సంవత్సరాల లోపలే మొదలవుతున్నాయి! అంటే కొంతమంది పిల్లల్లోనే ఈ క్యాన్సర్ కు బీజం పడిపోతుంది. దశాబ్దాల తర్వాత అది వ్యాధిగా వెలుగులోకి వస్తుంది.
కారణాలేంటంటే…
కోలిబాక్టిన్ ను ఉత్పత్తి చేసే ఇ.కోలి బాక్టీరియా మన పేగులలో నివసిస్తాయి. సాధారణంగా అన్ని ఇ.కోలి హానికరాలు కావు. కానీ ఈ ప్రత్యేక జాతులు మాత్రం డీఎన్ఏని నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆధునిక జీవనశైలిలోని కొన్ని మార్పులు హానికర బాక్టీరియా పెరగడానికి కారణమవుతున్నాయి.
• తరచుగా యాంటీబయోటిక్ వాడకం
• ప్రాసెస్ చేసిన ఆహారపు అలవాట్లు
• తల్లిపాలు తక్కువగా ఇవ్వడం
• సిజేరియన్ డెలివరీల పెరుగుదల
• గ్రూప్ చైల్డ్ కేర్‌లో పిల్లల పెంపకం
క్యాన్సర్ అనేది పెద్దవయసులో వచ్చే వ్యాధి” అనే పాత భావనను ఈ పరిశోధన పూర్తిగా మార్చేస్తోంది. చిన్న వయసులోనే పేగు మైక్రోబయోమ్ లో ఏర్పడే అసమతుల్యతలు భవిష్యత్తులో కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చని ఇది స్పష్టం చేస్తోంది.
ముందస్తు నిర్ధారణ సాధ్యమా?
ఇప్పుడు శాస్త్రవేత్తలు రెండు కొత్త మార్గాలపై పని చేస్తున్నారు:
1. స్టూల్ టెస్ట్ (మల పరీక్ష) ద్వారా కోలిబాక్టిన్ మ్యూటేషన్లను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత అభివృద్ధి చేస్తున్నారు.
2. ప్రోబయోటిక్స్ సహాయంతో ఈ హానికర బాక్టీరియాను పేగుల నుండి తొలగించే మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ రెండు పద్ధతులు ఫలిస్తే, భవిష్యత్తులో చిన్నారుల దశ నుంచే క్యాన్సర్ నివారణ ప్రణాళికలు రూపొందించవచ్చు.