Dengue Alert | డెంగ్యూ మళ్లీ వచ్చేసింది.. భద్రం!

వర్షాకాలం వచ్చిదంటే చాలు.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందులోనూ దోమకాటుతో వ్యాపించే వ్యాధులు మరీనూ. ఇందులో అత్యంత ప్రమాదకారి డెంగ్యూ. తగిన సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి తగలకుండా చూసుకోవచ్చు. మరి జాగ్రత్తలు పాటిస్తారు కదూ!!

  • By: TAAZ    health    Jul 27, 2025 12:10 AM IST
Dengue Alert | డెంగ్యూ మళ్లీ వచ్చేసింది.. భద్రం!

Dengue Alert | వర్షాకాలం వచ్చిందంటే బురద రోడ్లు, ఆ రోడ్లపై నిలిచిపోయిన నీళ్లు… నగరాల్లో కూడా కామన్ అయిపోయాయి. వీటితో పాటు పుట్టుకొచ్చే దోమలు కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతాయి. డెంగ్యూ లాంటి వైరస్ లను విస్తరింపజేస్తాయి. ప్రతి ఏటా వర్షాల్లో దోమలు తెచ్చే వ్యాధుల్లో డెంగ్యూ ముందు వరుసలో ఉంటుంది. పసిపిల్లలే కాదు, పెద్దవాళ్లు, యువత.. ఇలా లింగ, వయో భేదం లేకుండా దాడి చేసే డెంగ్యూ పట్ల అప్రమత్తం కావాల్సిన కాలం.. వర్షాకాలం.

దోమ – వైరస్

డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటుతో వ్యాపిస్తుంది. ఈ దోమ పగటి సమయంలో కాటు వేస్తుంది. సాధారణంగా మురికినీటి వల్లనే ఇన్ ఫెక్షన్లు వస్తుంటాయనుకుంటాం. కానీ మంచినీళ్ల ద్వారా కూడా ఇన్ ఫెక్షన్ ను వ్యాపింపచేయగల దోమ ఇది. డెంగ్యూ దోమలు ఎక్కువగా ఇంటి చుట్టుపక్కల నిలిచిపోయి స్థిరంగా ఉన్న శుభ్రమైన నీటిలోనే పెరుగుతుంటాయి. అందుకే ట్యాంకులు, కూలర్లు, నీటి బకెట్లు వంటి వాటిలో వీటి పెరుగుదల ఎక్కువ.

లక్షణాలు ఎలా?

ఒకసారి ఈ వైరస్ శరీరంలో ప్రవేశించగానే, 4–7 రోజుల లోపల లక్షణాలు కనిపించవచ్చు. డెంగ్యూకు నాలుగు రకాల వైరస్లు ఉన్నాయి. ఒకసారి సోకిన తర్వాత ఇంకొక రకం సోకితే తీవ్రమైన డెంగ్యూగా మారే ప్రమాదం ఉంటుంది.

డెంగ్యూ లక్షణాలు సాధారణంగా ఇలా ఉంటాయి:

  • ఆకస్మికంగా అధిక జ్వరం
  • తీవ్రమైన తలనొప్పి
  • కళ్ళ వెనుక నొప్పి
  • కండరాల నొప్పి, మైకం
  • చర్మంపై గులాబీ రంగు దద్దుర్లు
  • ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం
  • కొన్నిసార్లు ముక్కునుండి రక్తస్రావం

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం.

అత్యవసర చికిత్స అవసరమా?

సాధారణంగా డెంగ్యూ జ్వరం పారాసిటమాల్ తో కంట్రోల్ లోకి వస్తుంది. డెంగ్యూకు ప్రత్యక్షంగా పనిచేసే యాంటీవైరల్ ఔషధం ఇప్పటివరకు అందుబాటులో లేదు. అందుకే, చికిత్స పూర్తిగా లక్షణాల ఆధారంగా ఉంటుంది.

  • జ్వరం నియంత్రించేందుకు పారాసిటమాల్
  • శరీరంలో నీటి శాతం నిలిపేందుకు ఘన మద్యం పానీయాలు, కొబ్బరి నీరు, పళ్ళ రసాలు
  • ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో ఉండటం

మనవాళ్లకు మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకుని వాడే అలవాటు ఉంటుంది. డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ఇలా వాడితే మరింత ప్రమాదం. యాస్పిరిన్, ఇబూప్రొఫెన్ వంటి మందులు వాడుతున్నవాళ్లయితే ఇవి రక్తస్రావాన్ని పెంచే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డాక్టర్ ని సంప్రదించడం తప్పనిసరి.

నివారణే ఉత్తమ మార్గం

ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • ఇంటి చుట్టుపక్కల నిలిచిన నీరు తొలగించాలి
  • కూలర్లు, బకెట్లు, నీటి డబ్బాలు తరచూ శుభ్రం చేయాలి
  • ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి
  • మస్కిటో నెట్‌లు, రిపెలెంట్లు వాడాలి
  • బాలింతలు, చిన్నారులు, వృద్ధులు – వీరిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

ఆరోగ్య శాఖ చర్యలు

ప్రభుత్వం ఫాగింగ్, లార్విసైడ్ స్ప్రేలు వంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజల సహకారం లేకుండా దీన్ని పూర్తిగా నియంత్రించడం కష్టం. సామూహిక అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల స్థాయిలో అవగాహన కల్పించడం అనివార్యం. ప్రస్తుతం డెంగ్యూ మహమ్మారి స్థాయిలో వ్యాపించకపోయినప్పటికీ ప్రమాదకరమైన స్థాయిలోనే ఉంది. అందుకే దీన్ని సాధారణ జ్వరంగా తేలిగ్గా తీసుకోవద్దు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి వ్యక్తీ తమ బాధ్యతగా భావిస్తే ఈ దోమలు పెరగకుండా నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి..

Banakacharla | ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఉచిత పథకాలకంటే డేంజర్‌.. బనకచర్ల!
Polavaram A water Bomb? | కాళేశ్వరం తరహాలో పోలవరానికి సీపేజ్‌ రూపంలో పెను ముప్పు?