విధాత: ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ(మూత్ర పిండాలు)లలో రాళ్ల సమస్యతో కోట్ల మంది ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. కిడ్నీల్లో రాళ్లను తొలగించేందుకు ప్రస్తుతం పలు రకాల వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి ఉన్నాయి. వాటికంటే మెరుగైన పద్ధతిలో కిడ్నీలోని రాళ్లను తొలగించడానికి దక్షిణ కొరియా, అమెరికా శాస్త్రవేత్తలు ‘ఫెర్రోబాట్స్’ పేరుతో అతిచిన్న మాగ్నెటిక్ రోబోట్లను రూపొందించారు. ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపే ఈ రోబోట్లు నేరుగా రాళ్ల వద్దకు చేరుకుని, పక్కన ఉండే కణాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, రక్తస్రావం లేకుండా సర్జరీ చేస్తాయి. దీనివల్ల నొప్పి, ఇన్ఫెక్షన్లు ఉండవని, రోగులు త్వరగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.
కిడ్నీలలో రాళ్లు సమస్యలు యునైటెడ్ స్టేట్స్‌లో 10 మంది పురుషులలో ఒకరి కంటే ఎక్కువ మందికి, 14 మంది స్త్రీలలో ఒకరికి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఏర్పడతాయి. మూత్రపిండాలలో రాళ్లతో మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, ,మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, నడుము కింది భాగంలో, బొడ్డు కింద భాగంలో, గజ్జ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కిడ్నీలో రాయి చిన్నగా ఉండి, దానంతట అదే బయటకు వెళ్ళగలిగితే నెఫ్రాలజిస్టు డాక్టర్ (మూత్రపిండాలకు చికిత్స చేసే వైద్యుడు ) మూత్ర నాళం ద్వారా రాయిని బయటకు తరలించడానికి ఎక్కువగా నీరు త్రాగమని సిఫారసు చేస్తుంటారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఈ క్రింది చికిత్స విధానాలు అమలు చేస్తున్నారు.
లిథోట్రిప్సీ చికిత్సలో షాక్ వేవ్స్ ద్వారా కిడ్నీ స్టోన్‌ను చిన్న ముక్కలుగా విడగొట్టవచ్చు. చికిత్స తర్వాత, కిడ్నీ స్టోన్ యొక్క చిన్న ముక్కలు మూత్ర నాళం గుండా వెళ్లి..మూత్రం ద్వారా బయటకు వస్తాయి . ఈ చికిత్సకు సాధారణంగా ఒక గంట సమయం పడుతుంది. సాధారణ అనస్థీషియా కింద ఈ ప్రక్రియను చేయవచ్చు.
యూరిటెరోస్కోపీ విధానంలో వైద్యుడు మూత్రాశయం ద్వారా ఒక పొడవైన గొట్టం లాంటి సాధనాన్ని మూత్రనాళంలోకి చొప్పించి చిన్న రాళ్లను బయటకు తీస్తాడు. అదే పెద్ద రాళ్లయితే వాటిని లేజర్ ఉపయోగించి చిన్న ముక్కలుగా విరిచి మూత్ర నాళం గుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేలా చేస్తారు. రాయి మూత్రాశయంలో ఉంటే వైద్యుడు సిస్టోస్కోప్‌ను ఉపయోగించి మూత్రాశయంలోకి వెళ్లి చికిత్స కొనసాగిస్తారు. ఈ రెండు ప్రక్రియలు సాధారణ అనస్థీషియా కింద చేయబడతాయి.
కొన్నిసార్లు రాయి పరిమాణం మేరకు సమస్య తీవ్రతను అనుసరించి శస్త్రచికిత్స చేస్తారు. దీనిని పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో వీపులో చిన్న కోత ద్వారా మూత్రపిండాలలోకి ఒక గొట్టాన్ని చొప్పించడం జరుగుతుంది. ఈ గొట్టం వైద్యులు రాయిని గుర్తించి తొలగించడానికి సహాయపడుతుంది. రాయి చాలా పెద్దదిగా ఉంటే, వారు రాయిని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి లేజర్‌ను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ అనస్థీషియా కింద జరుగుతుంది.