Eli Lilly in Telangana | తెలంగాణలో అమెరికా ఫార్మా దిగ్గజం ఇలీ లిల్లీ భారీ పెట్టుబడి
అమెరికా ఫార్మా సంస్థ ఇలీ లిల్లీ తెలంగాణలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. కొత్త ఔషధ తయారీ కేంద్రం, గ్లోబల్ సప్లై నెట్‌వర్క్ విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంది.

US Pharma Giant Eli Lilly To Invest USD 1 Billion In Telangana To Expand Global Drug Manufacturing
హైదరాబాద్, అక్టోబర్ 6 (విధాత):
అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఇలీ లిల్లీ (Eli Lilly) తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. సుమారు ఒక బిలియన్ డాలర్ల(రూ. 8,000 కోట్లు పైగా) విలువైన ఈ పెట్టుబడి ద్వారా హైదరాబాదులో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఔషధ సరఫరా సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పెట్టుబడి తెలంగాణ ఫార్మా రంగానికి మరో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అధికారికంగా ప్రకటించిన ఇలీ లిల్లీ ప్రతినిధులు
సోమవారం ఇలీ లిల్లీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబులను హైదరాబాద్‌లోని ఇన్‌టిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలిసి ఈ పెట్టుబడి ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. ఈ భేటీలో మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎలి లిల్లి సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో సంస్థ హైదరాబాదులో తన Global Capability Centre (GCC)ను ప్రారంభించింది. ఆ కేంద్రం ద్వారా ఇప్పటికే పరిశోధన, డిజిటల్ సొల్యూషన్స్ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఇప్పుడు తయారీ విభాగం వరకు విస్తరించాలని నిర్ణయించడం తెలంగాణపై సంస్థ నమ్మకాన్ని సూచిస్తోంది.
అధికారిక ప్రకటన ప్రకారం, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల నుండి బలమైన పోటీ ఉన్నప్పటికీ, ఇలీ లిల్లీ చివరికి తెలంగాణాన్నే ఎంచుకుంది. ఇందుకు కారణం రాష్ట్రంలో ఉన్న నైపుణ్యమున్న శ్రామిక శక్తి, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రతిస్పందనాత్మక ప్రభుత్వం మరియు పరిశ్రమల పట్ల అనుకూల వాతావరణం. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ ఫార్మా హబ్‌గా గుర్తింపును సంపాదించుకుంది. డీఆర్‌ఎల్, బయోకాన్, నోవార్టిస్, సైనోజెన్, జీఈ హెల్త్‌కేర్ వంటి సంస్థల తర్వాత ఇప్పుడు ఇలీ లిల్లీ చేరడం తెలంగాణ బయోమెడికల్ రంగానికి మరో బలమైన అడుగుగా భావిస్తున్నారు.
తెలంగాణలో నూతన ఔషధ తయారీకేంద్రం
సంస్థ ప్రతినిధులు తెలిపిన ప్రకారం, ఈ కొత్త తయారీ కేంద్రం ద్వారా డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్ మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు సంబంధించిన కొత్త ఔషధాల తయారీ జరగనుంది. హైదరాబాదులో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి అవసరమైన మౌలిక వసతులు, లాజిస్టిక్ సపోర్ట్ తెలంగాణలో ఇప్పటికే ఉన్నాయని కంపెనీ నిర్ధారించుకుంది. ఈ పెట్టుబడితో నేరుగా వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, పరోక్షంగా మరిన్ని వేల మందికి అవకాశాలు సృష్టిస్తుందని అంచనా.
పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఇలీ లిల్లీ పెట్టుబడి తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి మైలురాయి అని అన్నారు. “హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచ ఫార్మా రంగంలో కీలక కేంద్రంగా అవతరిస్తోంది. ఇలీ లిల్లీ పెట్టుబడి నిర్ణయం తెలంగాణ పరిశ్రమల దిశగా ప్రభుత్వ కృషికి మద్దతు ఇస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఆధునిక ఆరోగ్య రక్షణ రంగానికి కొత్త ఊపునిస్తుంది,” అని పేర్కొన్నారు.
ఇలీ లిల్లీ సంస్థ 147 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా ఫార్మా దిగ్గజం. నూతన మందుల పరిశోధన, బయోటెక్నాలజీ, డిజిటల్ మెడికల్ సొల్యూషన్స్‌లో ఇది చాలా పేరెన్నికగన్న సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్‌లో పెట్టుబడి ,విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో ఈ పెట్టుబడి కేవలం తయారీ విస్తరణకే కాదు, గ్లోబల్ సప్లై చైన్‌లో రాష్ట్ర స్థానాన్ని మరింత బలపరచడానికీ ఉపయోగపడనుంది.