Israel | గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడిలో 30 మంది మృతి .. మరో దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది

సెంట్రల్‌ గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఒక పాఠశాలపై ఇజ్రాయెల్‌ దళాలు శనివారం జరిపిన వైమానిక దాడుల్లో 30 మందికిపైగా చనిపోయారు.

Israel | గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడిలో 30 మంది మృతి .. మరో దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది

దైర్‌ అల్ బలాహ్‌ (గాజా స్రిప్‌) : సెంట్రల్‌ గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఒక పాఠశాలపై ఇజ్రాయెల్‌ దళాలు శనివారం జరిపిన వైమానిక దాడుల్లో 30 మందికిపైగా చనిపోయారు. ప్రతిపాదిత కాల్పుల విరమణ ఒప్పందంపై అంతర్జాతీయ మధ్యవర్తులను కలిసేందుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధులు సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడి చోటు చేసుకున్నది. దైర్‌ అల్‌ బలాహ్‌లోని ఈ స్కూలుపై జరిగిన బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన సుమారు 30 మందిని అల్‌ అఖ్సా హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే వారంతా చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ ప్రాంగణాన్ని హమాస్‌ నియంత్రణలో ఉన్నదని, ఇక్కడ భారీగా ఆయుధాలను నిల్వ ఉంచడంతోపాటు.. దాడులకు వ్యూహాలు పన్నుతున్నారని ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆరోపించింది. మిలిటెంట్లు ఆ ప్రాంతాన్ని తలదాచుకునేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నది. అక్కడి నుంచి ఐడీఎఫ్‌ బలగాలపై అసంఖ్యాక దాడులకు వ్యూహాలు పన్నుతున్నారని పేర్కొన్నది.

ఈ పాఠశాలలో వేల మంది తలదాచుకుంటున్నారని, ఈ ప్రాంతం వైద్య శిబిరంగా కూడా పనిచేస్తున్నదని గాజాలోని పౌర రక్షణ సిబ్బంది చెబుతున్నారు. మృతదేహాలను తరలించిన హాస్పిటల్‌ వద్ద పరిస్థితి భీతావహంగా ఉన్నదని అక్కడి అసోసియేటెడ్‌ ప్రెస్‌ జర్నలిస్టులు తెలిపారు. కొంత మంది వ్యక్తులు ఎదురుగా పరుగులు తీస్తూ వస్తుండగా.. దుబ్బ రేగుతున్న రోడ్ల మీదుగా ఒక అంబులెన్స్‌ దూసుకుపోవడం కనిపించిందని పేర్కొన్నారు. గాయపడిన ఒక వ్యక్తి నేలమీదే స్ర్టెచర్‌పై పడి ఉన్నాడని, ఒక మృతదేహంపై దుప్పటికప్పి ఉన్నదని, పక్కనే ఉన్న అంబులెన్స్‌లో ఒక చిన్నారి మృతదేహం పడి ఉన్నదని వారు తెలిపారు.

పాఠశాల లోపల తరగతి గదులన్నీ ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాల కింద తమవారు ఎవరున్నారో అని అక్కడి ప్రజలు వేదనతో వెతుకుతుండటం కనిపించిందని వారు పేర్కొన్నారు. తమ ఆప్తుల మృతదేహం కనిపించగానే భోరున విలపిస్తున్నారు. శనివారం జరిగిన ఇతర దాడుల్లో మరో 12 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆదివారం అమెరికా, ఈజిప్ట్‌, ఖతార్‌, ఇజ్రాయెల్‌ అధికారులు ఇటలీలో సమావేశం కావడానికి ముందు రోజు ఈ వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బందీల వ్యవహారం, కాల్పుల విరమణపై వారు చర్చించనున్నారు. ఖతార్‌ ప్రధాన మంత్రి మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థాని, మొస్సాద్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బర్నియా, ఈజిప్ట్‌ గూఢచార సంస్థ చీఫ్‌ అబ్బాస్‌ కామెల్‌ను సీఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్స్‌ ఆదివారం కలుస్తారని తెలుస్తున్నది.

ప్రస్తుతం పరిగణనలో ఉన్న మూడంచెల ప్రాథమిక ఫ్రేమ్‌వర్క్‌పై ఇజ్రాయెల్‌, హమాస్‌ ఒక అంగీకారానికి వచ్చినట్టు అమెరికా అధికారులు శుక్రవారం తెలిపారు. అయితే.. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు మాత్రం పూర్తి విజయం సాధించేంత వరకూ గాజాపై దాడులు కొనసాతాయని ప్రకటించడం గమనార్హం. అయితే.. స్కూలుపై దాడి నేపథ్యంలో నెతన్యాహు ప్రసంగాన్ని పాలస్తీనా అధికారులు తీవ్రంగా ఖండించారు.