కైరో: ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ వేగంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 174 దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో దాదాపు డజనుకుపైగా దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్ చూపు చూడలేని దయనీయ స్థితిలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటిని ముందుగానే సేకరించి పంపిణీ చేయడంలో ధనిక దేశాలు ముందున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పదేపదే చెబుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 174 దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా దాదాపు 128కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగలిగారు. అయినప్పటికీ ఆఫ్రికాలోని పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అనే సంగతే తెలియదు. ఛాద్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ అక్కడ వ్యాక్సిన్‌పై చర్చ జరగడం లేదని ఇందుకు పేద దేశాలు కావడమే తమకు శాపమని అక్కడి వైద్య ఆరోగ్య సిబ్బంది వాపోతున్నారు.