ప్రపంచం నెత్తిన చైనా మరో ఉత్పాతం

భూమివైపు దూసుకొస్తున్న ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ విధాత‌: ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచం నెత్తిన చైనా మరో ఉత్పాతాన్ని తెచ్చిపెట్టింది. గతవారం ఆ దేశం ప్రయోగించిన ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ అనే రాకెట్‌ భూమిపై కూలే దిశగా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నది. ఈ వారాంతంలో భూ వాతావరణంలోకి ప్రవేశించే ఈ రాకెట్‌ లొకేషన్‌ను గుర్తించే పనిలో ఉన్నామని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ మంగళవారం వెల్లడించింది. ‘అమెరికా స్పేస్‌ కమాండ్‌’ రాకెట్‌ మార్గాన్ని పసిగట్టే పనిలో […]

  • Publish Date - May 6, 2021 / 06:42 AM IST

భూమివైపు దూసుకొస్తున్న ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌

విధాత‌: ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచం నెత్తిన చైనా మరో ఉత్పాతాన్ని తెచ్చిపెట్టింది. గతవారం ఆ దేశం ప్రయోగించిన ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ అనే రాకెట్‌ భూమిపై కూలే దిశగా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నది. ఈ వారాంతంలో భూ వాతావరణంలోకి ప్రవేశించే ఈ రాకెట్‌ లొకేషన్‌ను గుర్తించే పనిలో ఉన్నామని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ మంగళవారం వెల్లడించింది. ‘అమెరికా స్పేస్‌ కమాండ్‌’ రాకెట్‌ మార్గాన్ని పసిగట్టే పనిలో ఉన్నదని వివరించింది.

‘శనివారం (మే 8)న లాంగ్‌ మార్చ్‌ 5బీ భూ వాతావరణంలో ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రవేశానికి కొన్ని గంటల ముందే ఆ విషయం తెలుస్తుంది’ అని అమెరికా రక్షణ విభాగం ప్రతినిధి మైక్‌ హోవర్డ్‌ తెలిపారు. ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ శకలాలు జనావాసాలపై కూలుతాయేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ రాకెట్‌.. తలెత్తిన సమస్యేంటి?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ప్రత్యామ్నాయంగా, తమ కోసం ప్రత్యేకంగా ‘టియాన్‌హే’ పేరిట ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని చైనా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘టియాన్‌హే’ నిర్మాణం కోసం గత గురువారం ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం తీసుకెళ్లిన కొంత సామగ్రిని రాకెట్‌ కక్ష్యలో ప్రవేశపెట్టి పని ముగించింది. అనంతరం ఆ రాకెట్‌ శకలాలు పొరపాటున మరో తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అలా నియంత్రణ కోల్పోయిన ఆ శకలాలు అక్కడినుంచి భూమి వైపునకు వేగంగా దూసుకువస్తున్నాయి.

నిపుణులేమంటున్నారు?
‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ బరువు 22 టన్నులు. భూ వాతావరణంలోకి ప్రవేశించగానే రాకెట్‌కు సంబంధించిన కొన్ని శకలాలు మండిపోయినప్పటికీ, మరికొన్ని చిన్న శకలాలు మిగిలి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరంఏమీ లేదని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్‌ మెక్‌డోవెల్‌ పేర్కొన్నారు.

రాకెట్‌ ఎక్కడ పడొచ్చంటే?
‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ రాకెట్‌ శకలాలు ప్రధానంగా సముద్రంలో పడొచ్చని ఎక్కువ మంది నిపుణుల అంచనా. న్యూయార్క్‌, మాడ్రిడ్‌, బీజింగ్‌, చిలీ, న్యూజిలాండ్‌ తదితర దేశాలు, ప్రదేశాల్లోనూ పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

గతంలో కూడా..
గతేడాది చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ (తొలి వెర్షన్‌) శకలాలు పశ్చిమ ఆఫ్రికా ఐవోరీ తీరంలో పడి పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 1979లో అమెరికా అంతరిక్ష ల్యాబొరేటరీ ‘స్కైలాబ్‌’ కూలిన ఘటన తర్వాత ఇదే అతిపెద్ద రోదసి ప్రమాదం.