విధాత: యావత్ ప్రపంచం కోవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణం. విశ్వవ్యాప్త సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని దక్షిణాఫ్రికా, భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ మహమ్మారిని అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంటు మినహాయింపును వాషింగ్టన్ సమర్థిస్తున్నదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరిన్ టాయ్ ప్రకటించారు. “ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం.
అసాధారణ పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం. అందుకు మన ప్రతిస్పందన కూడా అసాధారణంగానే ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ జరిపే ఏకాభిప్రాయ సాధన కృషికి కొంత సమయం పట్టవచ్చని ఆమె గుర్తు చేశారు. అమెరికా సమాజానికి సరపడా సరఫరాలు సమకూరినందున ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం టీకాల ఉత్పాదన, పంపిణీ విస్తరణపై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. అలాగే టీకా ముడి పదార్థాల ఉత్పత్తి పెంచేందుకు కూడా కృషి చేస్తుందని టాయ్ తెలిపారు.