దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?
పశ్చిమాసియా యుద్ద సంక్షోభం పేరుతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 10సూచనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆర్థిక వ్యూహంలో భాగంగానే ప్రధాని సూచనలు చూడాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రధాని సూచనలు..వాటిని పాటిస్తే ఒనగూరే ప్రయోజనాలు..ప్రధాని సూచనల వెనుక మతలబు ఏమిటన్నదానిపై దేశ పౌరుల్లో జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ద సంక్షోభం పేరుతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 10సూచనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమాసియా యుద్దం అంతర్జాతీయ సంక్షోభంగా మారిందని..భారత్ పై కూడా యుద్ద పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని..ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశ ప్రజలు కొన్ని ఆర్థిక సంకల్పాలు తీసుకోవాలని మోదీ సికింద్రాబాద్ బీజేపీ పార్టీ సభా వేదికపై నుంచి అప్పిల్ చేశారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఉత్సాహంతో తదుపరి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించిన మోదీ ఈ దిశగా రాజకీయ ఉపన్యాసం చేస్తారని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ సభా వేదిక నుంచి దేశ ఆర్థిక సంక్షోభం గూర్చి ప్రధాని మోదీ మాట్లాడటం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.
స్వయంగా దేశ ప్రధానినే ప్రపంచం..దేశం సంక్షోభంలో ఉందంటూ చెప్పారంటే కచ్చితంగా ఏదో లోతైన కారణం ఉండే ఉంటుందన్న సందేహాలు దేశ పౌరుల్లో బలంగా ఏర్పడ్డాయి. ఇంతకుముందు ఈ మాదిరిగా ప్రధాని మోదీ చెప్పిన సందర్భాలు తక్కువ. ఎప్పుడో నోట్ల రద్దు తర్వాతా దేశ ప్రజలకు ప్రధాని ఈ స్థాయిలో ప్రత్యేక సందేశాలు..జాగ్రత్తలు చెప్పడం ఇదే కావడం చర్చనీయాంశమైంది.
మోదీ పది సూచనలు ఏమిటీ…
యుద్ద సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధార పడటం తగ్గించుకునేందుకు..విదేశీ మారక ద్రవ్యం పొదుపు కోసం ప్రధాని మోదీ ప్రధానంగా పది సూచనలు చేశారు. వాటిలో 1) ఏడాది పాటు బంగారం కొనవద్దు. 2) పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలి. 3) ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి. 4) వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వాలి.5)వ్యక్తిగత వాహనాలకు బదులుగా..మెట్రోలో ప్రయాణించాలి, ప్రజా రవాణ వినియోగించాలి. పార్సిళ్లను రైలు ద్వారా పంపాలి, 6) వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి. 7)రసాయనిక ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.8) విదేశీ కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు, స్వదేశి వస్తువులను వినియోగించాలి. 9)సోలార్ పంప్ లను వాడాలి 10) విదేశీ ప్రయాణాలు, ఆడంబరపు ఖర్చులు తగ్గించుకోవాలి.
మోదీ ప్రసంగం దేనికి సంకేతం.?
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’లో ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న గొడవలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ఇరాన్ విధిస్తున్న సుంకాలు, అమెరికా హెచ్చరికల మధ్య సరకు రవాణా నౌకలు ఆగిపోవడంతో ధరలు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల, మనపై ఆ ప్రభావం నేరుగా పడుతోంది.
ప్రధాని మోదీ చేసిన సూచనలను హెచ్చరికలు.. విన్నపాల కలయికగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాలు సృష్టించే ఆర్థిక విపత్తుల నుంచి బయటపడాలంటే, ప్రజలు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించవచ్చని మోదీ ఆశాభావంగా కనిపిస్తుందని విశ్లేషించారు. విలాసాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పేందుకు..సంక్షోభ సమయాలను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలను సమయాత్తం చేసేందుకు మార్గదర్శకాలుగా చూడవచ్చని చెబుతున్నారు.
మళ్లీ లాక్ డౌన్ పై సందేహాలు రేపిన కోవిడ్ కాలం ప్రస్తావన
ప్రధాని తన ప్రసంగంలో కోవిడ్-19 కాలాన్ని ప్రస్తావించడం ఆసక్తికరం. కోవిడ్ సమయంలో మనం అనివార్యంగా పాటించిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH), ఆన్‌లైన్ సమావేశాల పద్ధతిని ఇప్పుడు ఒక ఆర్థిక వ్యూహంగా మార్చుకోవాలని ఆయన సూచించడాన్ని ఆర్థిక నిపుణులు సైతం స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే ప్రయాణాలను తగ్గిస్తే, దేశవ్యాప్తంగా లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. ఇది కేవలం పౌరుల జేబుకే కాకుండా, దేశ విదేశీ మారక నిల్వలపై (Forex Reserves) ఒత్తిడిని కూడా తగ్గిస్తుందంటున్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేయడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా మలచుకోవడమేనని మోదీ ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారంటున్నారు.
కరోనా పాఠాలు..సంక్షోభ నివారణ మార్గాలు..
దేశ ప్రధానిగా మోదీ చేసిన 10సూచనలలో కొన్నింటినైనా రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పౌరులు అనివార్యంగా అనుసరించాల్సిన పరిస్థితి అయితే పశ్చిమాసియా యుద్ద సంక్షోభం తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు విన్న చాలామందిలో “మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా?” అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారిక ఆంక్షలను ఇంకా ప్రకటించలేదు. పైగా ప్రధాని స్వయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా వంటి వాటి కొరత నివారణకు ప్రత్యామ్నాయ అంతర్జాతీయ మార్గాలతో పరిష్కార ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రధాని సూచనలు ఆర్థిక నియంత్రణే తప్ప భౌతిక నియంత్రణగా పరిగణించే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎంత అవసరమో చెప్పడమే మోదీ ప్రసంగం ఉద్దేశ్యంగా కనిపించింది. అదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభం తీవ్రతరం అయితే దేశ ప్రజలు పాటించాల్సిన చర్యలకు సంకేతంగా కూడా ఉంది.
దేశ ఆర్థిక మనుగడకు కీలకమైన విదేశీ మారక ద్రవ్య పొదుపు
దేశ ఆర్థిక మనుగడకు కీలకమైన విదేశీ మారక ద్రవ్య పొదుపు దిశగా కొరతగా మారిన ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకు కరోనా కాలంలో దేశ ప్రజలు అలవాటు చేసుకున్న ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని మళ్ళీ వీలైనంత వరకు ఆచరణలోకి తీసుకురావాలని మోదీ సూచించారు. ఆఫీసులకు వెళ్లేందుకు చేసే ప్రయాణాలను తగ్గించడం ద్వారా ఇంధనాన్ని భారీగా ఆదా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వర్చువల్ సమావేశాలు, ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లను పెంచడం ద్వారా రవాణా అవసరాలను తగ్గించుకోవచ్చని, ఇది కేవలం కంపెనీలకే కాక దేశ హితానికి కూడా మేలు చేస్తుందని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చియాసియా యుద్దంతో నెలకొన్న అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్యులపై పడకుండా చూసేందుకు భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోందని, అయితే ప్రజల సహకారం లేనిదే ఈ భారీ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. యుద్ధాల వల్ల సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతిన్న తరుణంలో, భారతీయులందరూ ఏకతాటిపై నిలబడి తను చెప్పిన ‘ఆర్థిక క్రమశిక్షణ’ను పాటిస్తే సంక్షోభం నుండి త్వరగా బయటపడవచ్చునని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని సూచనలు పాటిస్తే..దేశ సేవ అవుతుందా..?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీనివల్ల భారత్ పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. “పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ఇప్పుడు మన జాతీయ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. కేవలం దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు..ఇంధనాన్ని పొదుపు చేయడం కూడా గొప్ప దేశభక్తే అవుతుంది అని ఆయన ఉద్ఘాటించారు. పౌరులు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను (మెట్రో, బస్సులు) ఉపయోగించాలని, కార్‌పూలింగ్ వంటి పద్ధతులను పాటించాలని కోరారు.
కేవలం ఇంధనమే కాకుండా, మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెలు, రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించాలని ప్రధాని కోరారు. “ప్రతి ఇల్లు వంట నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించినా, అది దేశ ఖజానాకు గొప్ప ఊరటనిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా మంచిది” అని ఆయన సూచించారు. రైతులు కూడా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.
దేశ హితం కోసమే ఆడంబరాలు..విదేశీ పర్యటనలపై సూచనలు
మధ్యతరగతి ప్రజల్లో పెరిగిన విదేశీ పర్యటనలు, సంపన్న వర్గాల డెస్టినేషన్ వెడ్డింగ్స్ (విదేశాల్లో వివాహాలు) సంస్కృతి గురించి ప్రధాని ప్రస్తావించారు. దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని కోరారు. అలాగే, వివాహాల కోసం బంగారం కొనుగోలును కూడా వీలైనంత వరకు తగ్గించాలని, ఇది దేశ సంపదను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
బంగారంపై ప్రధాని విప్లవాత్మక సూచన
భారతీయులకు బంగారానికి ఉన్న విడదీయరాని బంధాన్ని ప్రస్తావిస్తూనే ప్రధాని అనివార్యతగా ఏడాది పాటు ప్రజలు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ విప్లవాత్మక విజ్ఞప్తి చేయడం ఆసక్తికరం. కనీసం ఏడాది పాటు పెళ్లిళ్ల కోసం అనవసరమైన బంగారం కొనుగోళ్లు ఆపాలని కోరారు. వాస్తవిక దృక్కోణంలోంచి చూస్తే…చమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారకాన్ని వెచ్చిస్తోంది బంగారం దిగుమతులపైనే. యుద్ధ సమయంలో చమురు కోసం డాలర్లు అత్యవసరమైన తరుణంలో బంగారం కొనుగోళ్లు తగ్గించడం వల్ల రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చని ఆర్థిక, అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. అలాగే విదేశీ పర్యటనల కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కూడా ప్రధాని కోరారు. ఇది మేక్ ఇన్ ఇండియా వైపు అడుగులు వేయడంలో భాగంగా చూడాలని మోదీ కోరారు.
ప్రధాని మాటలతో పతనమైన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియా సంక్షోభాన్ని దేశం అధిగమించేందుకు ప్రజలు అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా సూచనలు దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మోదీ బంగారంపై చేసిన వ్యాఖ్యలతోపాటు ఇరాన్‌తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 850కిపైగా పాయింట్ల నష్టాలతో, నిఫ్టీ కూడా 232 పాయింట్లు పతనంతో నష్టాలను చవి చూశాయి. ప్రధాని మోదీ చేసిన ఆర్థిక క్రమశిక్షణ సూచనలు దేశ ఆర్థిక పరిణామాలకు సంకేతంగా చూడటంతోనే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అన్ని ప్రజలే చేస్తే..ప్రధాని ఏం చేస్తారో..?
పశ్చిమాసియా యుద్దంతో ఎదురవుతున్న సంక్షోభాన్ని భారత్ అధిగమించేందుకు దేశ ప్రజలు త్యాగాలు, పొదుపు చేయాలంటున్న ప్రధాని వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందంటూ ఏడాది పాటు బంగారం కొనకూడదని, చమురు ధరల పెరుగుదలతో భారం పడుతుందని ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని చేసిన సూచనలు మంచివే అయినప్పటికి..అన్నీ ప్రజలే చేస్తే ప్రధాని ఏం చేస్తాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు చెప్పే ముందుగా…దేశ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిథుల జీతభత్యాలలో, పర్యటనలలో శ్రీలంక తరహాలో కోతలు పెట్టాలని మరికొందరు సూచించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ విజ్ఞాపనలు, సూచనలపై దేశ పౌరులుగా విజ్ఞతతో ఆలోచించి దేశం కోసం ఏది మంచిదో దానిని అనుసరించడంలో.. స్వేచ్చాయుత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?
మోదీ ప్రకటన ఎఫెక్ట్.. తగ్గిన బంగారం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram