దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?

పశ్చిమాసియా యుద్ద సంక్షోభం పేరుతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 10సూచనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆర్థిక వ్యూహంలో భాగంగానే ప్రధాని సూచనలు చూడాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రధాని సూచనలు..వాటిని పాటిస్తే ఒనగూరే ప్రయోజనాలు..ప్రధాని సూచనల వెనుక మతలబు ఏమిటన్నదానిపై దేశ పౌరుల్లో జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

పశ్చిమాసియా యుద్ద సంక్షోభం పేరుతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 10సూచనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమాసియా యుద్దం అంతర్జాతీయ సంక్షోభంగా మారిందని..భారత్ పై కూడా యుద్ద పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని..ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశ ప్రజలు కొన్ని ఆర్థిక సంకల్పాలు తీసుకోవాలని మోదీ సికింద్రాబాద్ బీజేపీ పార్టీ సభా వేదికపై నుంచి అప్పిల్ చేశారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఉత్సాహంతో తదుపరి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించిన మోదీ ఈ దిశగా రాజకీయ ఉపన్యాసం చేస్తారని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ సభా వేదిక నుంచి దేశ ఆర్థిక సంక్షోభం గూర్చి ప్రధాని మోదీ మాట్లాడటం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.

స్వయంగా దేశ ప్రధానినే ప్రపంచం..దేశం సంక్షోభంలో ఉందంటూ చెప్పారంటే కచ్చితంగా ఏదో లోతైన కారణం ఉండే ఉంటుందన్న సందేహాలు దేశ పౌరుల్లో బలంగా ఏర్పడ్డాయి. ఇంతకుముందు ఈ మాదిరిగా ప్రధాని మోదీ చెప్పిన సందర్భాలు తక్కువ. ఎప్పుడో నోట్ల రద్దు తర్వాతా దేశ ప్రజలకు ప్రధాని ఈ స్థాయిలో ప్రత్యేక సందేశాలు..జాగ్రత్తలు చెప్పడం ఇదే కావడం చర్చనీయాంశమైంది.

మోదీ పది సూచనలు ఏమిటీ…

యుద్ద సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధార పడటం తగ్గించుకునేందుకు..విదేశీ మారక ద్రవ్యం పొదుపు కోసం ప్రధాని మోదీ ప్రధానంగా పది సూచనలు చేశారు. వాటిలో 1) ఏడాది పాటు బంగారం కొనవద్దు. 2) పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలి. 3) ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి. 4) వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వాలి.5)వ్యక్తిగత వాహనాలకు బదులుగా..మెట్రోలో ప్రయాణించాలి, ప్రజా రవాణ వినియోగించాలి. పార్సిళ్లను రైలు ద్వారా పంపాలి, 6) వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి. 7)రసాయనిక ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.8) విదేశీ కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు, స్వదేశి వస్తువులను వినియోగించాలి. 9)సోలార్ పంప్ లను వాడాలి 10) విదేశీ ప్రయాణాలు, ఆడంబరపు ఖర్చులు తగ్గించుకోవాలి.

ప్రధాని మాటలతో పతనమైన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియా సంక్షోభాన్ని దేశం అధిగమించేందుకు ప్రజలు అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా సూచనలు దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మోదీ బంగారంపై చేసిన వ్యాఖ్యలతోపాటు ఇరాన్‌తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 850కిపైగా పాయింట్ల నష్టాలతో, నిఫ్టీ కూడా 232 పాయింట్లు పతనంతో నష్టాలను చవి చూశాయి. ప్రధాని మోదీ చేసిన ఆర్థిక క్రమశిక్షణ సూచనలు దేశ ఆర్థిక పరిణామాలకు సంకేతంగా చూడటంతోనే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అన్ని ప్రజలే చేస్తే..ప్రధాని ఏం చేస్తారో..?

పశ్చిమాసియా యుద్దంతో ఎదురవుతున్న సంక్షోభాన్ని భారత్ అధిగమించేందుకు దేశ ప్రజలు త్యాగాలు, పొదుపు చేయాలంటున్న ప్రధాని వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందంటూ ఏడాది పాటు బంగారం కొనకూడదని, చమురు ధరల పెరుగుదలతో భారం పడుతుందని ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని చేసిన సూచనలు మంచివే అయినప్పటికి..అన్నీ ప్రజలే చేస్తే ప్రధాని ఏం చేస్తాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు చెప్పే ముందుగా…దేశ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిథుల జీతభత్యాలలో, పర్యటనలలో శ్రీలంక తరహాలో కోతలు పెట్టాలని మరికొందరు సూచించారు.  ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ విజ్ఞాపనలు, సూచనలపై దేశ పౌరులుగా విజ్ఞతతో ఆలోచించి దేశం కోసం ఏది మంచిదో దానిని అనుసరించడంలో.. స్వేచ్చాయుత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత  ప్రజలదేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?
మోదీ ప్రకటన ఎఫెక్ట్.. తగ్గిన బంగారం

Latest News