‘కోహినూర్ వజ్రం’ను భారత్ కు ఇవ్వాల్సిందే: న్యూయార్క్ మేయర్
కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని న్యూయార్క్ మేయర్ మమ్దానీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బ్రిటన్ రాజుకు విజ్ఞప్తి చేస్తానన్నారు.
చారిత్రక ‘కోహినూర్ వజ్రం’ను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ మూలాలున్న మేయర్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీంతో కోహినూర్ వజ్రం అంశం మరోసారి తెర పైకి వచ్చింది. తనకు అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ రాజు చార్లెస్ 3ని తాను కోరతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు.
బ్రిటన్ రాజు చార్లెస్ 3, రాణి కెమిల్లా బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వారు న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు మమ్దానీ మీడియా సమావేశంలో కోహినూర్ అంశాన్ని ప్రస్తావించడం ఆసక్తి రేపింది. ఒక కార్యక్రమంలో కాకుండా.. రాజు చార్లెస్ 3తో విడిగా మాట్లాడే అవకాశం వస్తే.. కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతాను అని మమ్దాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాజు చార్లెస్ 3, మమ్దానీల మధ్య సంభాషణ జరిగినప్పటికి..వారి మధ్య చర్చల్లో కోహినూర్ వజ్రం ప్రస్తావన వచ్చిందా, లేదా అనేది మాత్రం తెలియరాలేదు.
అటు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్ నిరాకరించింది. రాజు చార్లెస్ 3,మమ్దానీల మధ్య చర్చల వివరాలను మేయర్ కార్యాలయం వెల్లడించలేదు.
భారత్ నుంచి బ్రిటన్ రాణి కిరీటంలోకి
భారత్‌కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ్.. విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు. అప్పటినుంచి ఆ వజ్రం వారి అధీనంలోనే ఉంది. క్వీన్ ఎలిజబెత్ ది క్వీన్ మదర్ కిరీటంలో ఈ వజ్రం పొదగబడి ఉంది. ప్రస్తుతం లండన్‌లోని టవర్ ఆఫ్ లండన్ లోని జ్యువెల్ హౌస్‌లో ప్రదర్శనలో ఉంది. దానిని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ప్రయత్నించినప్పటికీ.. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
కోహినూర్ చరిత్ర…వేల సంవత్సరాల ప్రయాణం
కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరంలో నల్లమల కొండల చెంత ఉన్న కొల్లూరు గనిలో దొరికింది. కాకతీయుల కాలంలో బయటపడిన ఈ వజ్రం, మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు రాజవంశీయుల చేతులు మారి, చివరకు బ్రిటిష్ వారి వశమైంది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందిన రీజెంట్ కూడా కోల్లూరులోనే దొరికింది. దార్యా-ఏ-నూర్, ఆర్లాఫ్, నిజామ్ డైమండ్, రీజెంట్ డైమెండ్, గ్రేట్ మొఘల్, హోప్ డైమండ్ వంటివి ఈ గనుల్లోనే దొరికాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కోహినూరు వజ్రం పుట్టిన కొల్లూరు గ్రామం పులిచింతల ప్రాజెక్టులో ముంపుతో ఖాళీ చేయబడింది.
గార్డన్ మెకంజీ కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు 19వ శతాబ్దంలో నమోదు చేసిన “మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్”లో కోహినూర్ వజ్రం కృష్ణా తీరంలోని కోల్లూరు గని వద్ద దొరికిందని రాశారు. ఆ ప్రాంతం గోల్కొండ పాలకుల కింద ఉందని ఆయన పేర్కొన్నారు. విత్తనాలు నాటుతున్న ఒక రైతుకు ఈ వజ్రం దొరికిందని టావెర్నియర్ రాశాడని మెకంజీ చెప్పారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో సైతం కోహినూర్ కొల్లూరు గనిలోనే దొరికినట్లుగా పేర్కొన్నారు. రాణి రుద్రమదేవి పరిపాలన కాలంలో కోల్లూరు వజ్రపు గనుల ప్రాశస్త్యం గురించి 13వ శతాబ్దిలోనే మార్కో పోలో రికార్డు చేశారు.
చరిత్ర పరిశోధకులు, దక్కన్ హెరిటేజ్ సంస్థ నిర్వాహకులు సఫియుల్లా, “1630 ప్రాంతాల్లో కోల్లూరులో ఒక వితంతువుకి ఈ వజ్రం దొరికింది. ఆమె దీన్ని గ్రామ పెద్దకు ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి నాటి కుతుబ్ షాహీల మంత్రి, వజ్రాల వ్యాపారి అయిన మీర్ జుమ్లాకు ఈ వజ్రం చేరింది. కోహినూర్ 700 క్యారెట్ల పైనే ఉంటుందనీ, కానీ దాన్ని ఆ గ్రామ పెద్ద ముక్కలుగా చేశాడనే కథనం ఉంది. మీర్ జుమ్లా దగ్గర అతి పెద్ద ముక్క ఉంది. కొన్ని ముక్కలు మార్కెట్లోకి వచ్చిఉండొచ్చు అని వివరించారు.
తెలుగు నేల నుంచి బ్రిటన్ రాణి కిరిటంలోకి..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. ఈ వజ్రం మొదటి యజమాని మాల్వా రాజు మహలక్ దేవ్ అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన చేతిలో క్రీ.శ. 1300వ సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని పేర్కొన్నారు. కోహినూర్ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదని చరిత్రకారుల మరో కథనం వెల్లడిస్తుంది. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని గణపతిదేవ చక్రవర్తి 1199 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం పరిపాలించాడు. కళింగ, వేంగి రాజవంశమైన తూర్పు గంగాల నుంచి 13వ శతాబ్దంలో కోహినూరు వజ్రం కాకతీయుల చెంతకు చేరింది. వారికి అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా నిలిచింది. కొల్లూరు గనులలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, గ్రామ పెద్ద ద్వారా గణపతిదేవ చక్రవర్తి కోహినూరు వజ్రాన్ని బహుమతిగా అందుకొని మొదటి యజమాని అయ్యారని ఓ కథనం. అతడు కాకతీయుల ఆరాధ్య దైవమైన శ్రీభద్రకాళి,తర్వాత కాకతీదేవి విగ్రహానికి నుదుటన అలంకరించి ఆరాధన చేశారని చరిత్ర చెబుతోంది. రాణిరుద్రమదేవి తన తండ్రి నుంచి కోహినూరును వారసత్వంగా పొందింది. ఆమె దానిని తొలుత భద్రకాళి దేవికి అలంకరణ కోసం అంకితం చేశారని చరిత్ర కారుల కథనం.
ఢిల్లీ నుంచి ఇరాన్ కు..తిరిగి భారత్ కు
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు..క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు, కోహినూర్ వజ్రాన్ని సమర్పించుకున్నాడు. అలా ఢిల్లీ చేరిన కోహినూర్ వజ్రాన్ని 1304లో డిల్లీ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని సమర్‌ఖండ్‌కు పంపించారు. పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోఢీ ఓటమి పాలై మరణించాడు. లోఢీ మరణానంతరం సుల్తానుల ఖజానాతో పాటు 1526లో కోహినూర్ వజ్రం బాబర్ వశమైంది. ఆ సమయంలో బాబర్ వజ్రంగా కూడా పేరు గాంచింది. ‘బాబర్ నామా’లో ప్రత్యేకంగా ఈ వజ్రం గురించి రాశాడు. దానిని సుల్తాన్ ఇబ్రహీం లోడి తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ప్రపంచంలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే సంపదలో సగం ధరకు సమానమైనది కోహినూర్ అని బాబర్‌నామాలో వ్యాఖ్యానించాడు. బాబర్ తర్వాత ఈ వజ్రాన్ని హుమాయూన్‌కి ఇచ్చాడు. బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఈ వజ్రం మొఘల్ వారసుల చేతులు మారుతూ వచ్చింది. ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహమ్మద్ షా కాలంలో ఇది దేశం దాటి పోయింది.
ఇరాన్ నుంచి పంజాబ్ కు..
పర్షియన్ జనరల్ నాదిర్ షా 1739 నాటికి భారత్ పై దండెత్తాడు. ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ షాను ఓడించి.. సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాడు. నాదిర్ షాకు లొంగిపోయిన మహమ్మద్ షా తన తలపాగాలో ఉన్న విలువైన వజ్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పుడే నాదిర్ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్‌గా నామకరణం చేశాడు. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతిశిఖరం’ అని అర్థం. అయితే కోహినూర్‌ను చేజిక్కించుకుని భారత్ విడిచి పర్షియా(ఇరాన్) వెళ్లిన నాదిర్‌షా దాన్ని తన బంగారు నెమలి సింహాసనంలో పొదిగాడు. నాదిర్షా 1747లో హత్యకు గురికావడంతో షా జనరల్స్‌లో ఒకరైన అహ్మద్ షా దుర్రాని చేతుల్లోకి కోహినూర్ వెళ్లింది. క్రీ.శ.1813వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజు దుర్రానీ వారసుడు షా షుజా దుర్రానీల నుంచి కోహినూర్ వజ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రతిగా అఫ్గాన్ సింహాసనాన్ని షా షుజా దక్కించుకునేందుకు రంజిత్ సింగ్ సహాయం చేశాడు.
సిక్కుల నుంచి బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి..
1849 నాటికి బ్రిటిష్ పాలకులు పంజాబ్‌ను పూర్తిగా ఆక్రమించి ఆభరణాలను జప్తు చేశారు. రాజు రంజిత్ సింగ్ చనిపోవడంతో ఆయన సతీమణి రాణి జిందన్‌ను ఖైదు చేసి జైలుకు పంపించారు. వారి కుమారుడైన బాలుడు దులీప్‌సింగ్‌తో బ్రిటిష్ వారు లాహోర్ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. వెంటనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అటు నుంచి భారీ ఓడలో డైమండ్‌ను తరలిస్తుండగా కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. 1850వ సంవత్సరంలో బ్రిటన్‌లో ఉన్న క్వీన్ విక్టోరియా వద్దకు డైమండ్ చేరింది. ఆమె దాన్ని లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే కోహినూర్ వన్నె తగ్గిందని భావించిన విక్టోరియా రాణి 1852లో దానికి మెరుగులు దిద్దించాలని నిర్ణయించారు. డచ్‌కు చెందిన జువెలర్ కాంటోర్‌కు ఆ పనిని అప్పగించగా కోహినూర్ నాణ్యత 186 క్యారెట్ల నుంచి 108.93 క్యారెట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజకుటుంబంలో వారసత్వ కానుకగా మారింది. ఈ వజ్రాన్ని తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేస్తున్నారు.
విక్టోరియా వీలునామా
కోహినూర్ చరిత్రలో దానిని ధరించిన లేదా తమ వద్ద దాచుకున్న రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దాంతో విక్టోరియా రాణి జాగ్రత్తపడింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే దానిని ధరిస్తూ వచ్చింది. మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీలునామా కూడా రాసింది. ఒక వేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రాణికి ఆ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని అందులో పేర్కొంది. విక్టోరియా తరువాత దాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్-2 తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్ ఆఫ్ లండన్ వద్దనున్న జువెల్ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం మాకు ఇవ్వాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ తిరస్కరించింది. పాక్, అఫ్గాన్ దేశాలు కూడా ఈ వజ్రం తమ సొంతమని.. తమకే ఇవ్వాలని అడుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
Mini Cooper | స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram