Chandrayaan-3 | చందమామపై రేస్.. ముందే దిగనున్న రష్యా ల్యాండర్!

Chandrayaan-3 | ‘చంద్రయాన్-3’ని వెనక్కుతోసి దక్షిణ ధృవమే ‘లూనా-25’ లక్ష్యం ఈ నెల 11న ప్రయోగం. దేశాలు.. భారత్ X రష్యా. అంతరిక్ష సంస్థలు.. ఇస్రో X రోస్ కాస్మోస్. రాకెట్లు.. లాంచ్ వెహికల్ మార్క్-3 X సోయజ్-2.1బి (ఫ్రిగాట్ అప్పర్ స్టేజి). మూన్ మిషన్స్… చంద్రయాన్-3 వర్సెస్ లూనా-25 (లూనా గ్లోబ్-1). ల్యాండర్లు.. విక్రమ్ వర్సెస్ లూనా-25. ఇదీ సంగతి! ఎప్పుడొచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? ముఖ్యం. రష్యన్ రాకెట్ ఇంకా గాల్లోకి లేవనే […]

  • Publish Date - August 11, 2023 / 03:47 AM IST

Chandrayaan-3 |

  • ‘చంద్రయాన్-3’ని వెనక్కుతోసి
  • దక్షిణ ధృవమే ‘లూనా-25’ లక్ష్యం
  • ఈ నెల 11న ప్రయోగం.

దేశాలు.. భారత్ X రష్యా. అంతరిక్ష సంస్థలు.. ఇస్రో X రోస్ కాస్మోస్. రాకెట్లు.. లాంచ్ వెహికల్ మార్క్-3 X సోయజ్-2.1బి (ఫ్రిగాట్ అప్పర్ స్టేజి). మూన్ మిషన్స్… చంద్రయాన్-3 వర్సెస్ లూనా-25 (లూనా గ్లోబ్-1). ల్యాండర్లు.. విక్రమ్ వర్సెస్ లూనా-25. ఇదీ సంగతి! ఎప్పుడొచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? ముఖ్యం.

రష్యన్ రాకెట్ ఇంకా గాల్లోకి లేవనే లేదు. వ్యోమనౌక ప్రయాణం ఆరంభమవనే లేదు. అయినా రేస్ మొదలైంది. ఇండియాను వెనక్కు నెట్టి అంతరిక్షంలో రష్యా దూసుకుపోతోంది! రష్యా ల్యాండర్ ‘లూనా-25’ మన ‘చంద్రయాన్-3’ కంటే ముందుగానే చంద్రుడి దక్షిణ ధృవంపై దిగబోతోంది. జాబిలి దక్షిణ ధృవంపై దిగే తొలి ల్యాండర్ బహుశా ఇదే కావచ్చేమో! ‘సోవియట్’ పాత వాసన వదిలించుకుని ఆధునిక రష్యా తొలిసారి దేశీయంగా రూపొందించిన వ్యోమ నౌకను చంద్రుడికేసి ప్రయోగించబోతోంది.

మాస్కోకు తూర్పుగా 5,500 కిలోమీటర్ల దూరంలోని వస్టాచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఈ నెల 11న రాకెట్టును ప్రయోగించాక కేవలం ఐదు రోజుల ప్రయాణంలో ‘లునా-25 మిషన్’ చంద్రకక్ష్యను చేరుతుంది.

5-7 రోజులు చంద్రకక్ష్యలో ఉండి ఈ నెల 21-23 తేదీల మధ్య చంద్రుడి ఉపరితలంపై ‘బొగుస్లావ్స్కీ బిలం’లో దిగుతుంది. ‘లూనా-25’ రోబోటిక్ ల్యాండర్ బరువు 800 కిలోలు. రోస్ కాస్మోస్ అనుబంధ సంస్థ, రష్యా ఏరోస్పేస్ కంపెనీ ‘ లావోచ్కీ’ ఈ ల్యాండరును డిజైన్ చేసింది. అందులో 8 పరికరాలు ఉన్నాయి.

ఉపరితలం నుంచి ఆరు అంగుళాల లోతు వరకు ల్యాండర్ తవ్వగలదు. జాబిలిపై సురక్షితంగా దిగడం, దక్షిణ ధృవంలో గడ్డ కట్టిన నీటిని కనుగొనడం ఈ మిషన్ లక్ష్యం. చందమామపై ల్యాండర్లను దించడం ‘మాజీ సోవియట్’కు కొత్త కాదు. 50 ఏళ్ల క్రితమే వాటిని పంపింది.

చివరిసారిగా సోవియట్ 1976లో ‘లూనా-24’ ల్యాండరును జాబిలిపైకి పంపింది. 170 గ్రాముల చంద్ర శిలలు, మట్టిని ఆ మిషన్ భూమికి తెచ్చింది. మన ‘చంద్రయాన్-3’, రష్యన్ ‘లూనా-25’.. ఈ రెండూ చంద్రుడి దక్షిణ ధృవంపై వేర్వేరు ప్రదేశాల్లో దిగనున్నాయి. బహుశా రెండూ ఒకే రోజు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మన ‘విక్రమ్’ ల్యాండర్, ‘ప్రజ్ఞాన్’ రోవర్ల జీవితకాలం అక్కడ 14 రోజులు మాత్రమే. కానీ రష్యన్ ‘లూనా-25’ ల్యాండర్ జీవితకాలం ఒక ఏడాది. వాస్తవానికి 2021 అక్టోబరులోనే ‘లూనా-25’ను ప్రయోగించాలి. రెండేళ్ల ఆలస్యమైంది. ‘లూనా-25’కు తన పైలట్-డి నేవిగేషన్ కెమెరాను అనుసంధానించి పరీక్షించాలని యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ESA) తొలుత భావించింది. నిరుడు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఆ ప్రాజెక్టు నుంచి ESA వైదొలగింది.