Tiger Kills Caretaker In Oklahoma | సంరక్షుడిని చంపేసిన పులి
ఓక్లాహోమా జంతు సంరక్షణ కేంద్రంలో పెద్ద పులి దాడి చేసి తన సంరక్షుడిని చంపింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్.

విధాత : వన్యప్రాణులను ఎంత ప్రేమగా పెంచిన అవి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయన్నది అంచన వేయడం కష్టమే. అందుకే క్రూరమృగాల పెంపకం ప్రాణాలతో చెలగాటమే అంటారు. తాజాగా అమెరికా టెక్సాస్ సమీపంలోని ఓక్లాహోమాలోని జంతు సంరక్షణ కేంద్రంలో తనను చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తున్న జంతు సంరక్షుడిని ఓ పెద్దపులి దాడి చేసి చంపడం వైరల్ గా మారింది. అగ్నేయ ఒక్లహోమా హ్యూగోలోని గ్రోలర్ పైన్స్ టైగర్ ప్రిజర్వ్‌లో జన సమూహం ముందు ప్రదర్శన ఇస్తుండగా..పులి సంరక్షుడు ర్యాన్ ఈస్లీ(37)పై దాడి చేసి చంపేసింది. ఊహించని ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈస్లీ భార్య, చిన్న కుమార్తెలు చూస్తుండగానే పులి దాడిలో ఈస్లీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఈస్లీ భార్య పరుగెత్తి పులిని మరొక బోనులోకి తరలించింది.
హ్యూగో పోలీసు అధికారులు అత్యవసర వైద్య సేవల సిబ్బందిని పంపించినప్పటికి భుజం, మెడలో తీవ్ర గాయాలతో ఈస్లీ ప్రాణాలు విడిచాడు. ఈస్లీ 10పులులతో ప్రదర్శలను ఇచ్చేవాడని..ఎప్పుడు కూడా చిన్న పొరపాటు..ప్రమాదాలు జరుగలేదని..దేశ వ్యాప్తంగా అతను అనేక ప్రదర్శనలు ఇచ్చాడని హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ వెల్లడించింది. ప్రమాదకరమైన అడవి జంతువులను వినోదం కోసం ఉపయోగించే ఇతర నిర్వాహకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో…క్రూర జంతువుల ప్రవర్తనను అంచనా వేయడంలో ఎంత నైపుణ్యంతో వ్యవహరించాలో.. ఈ సంఘటన చాటుతుందని క్యాప్టివ్ వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ లారా హెగెన్ అన్నారు.