crocodile attack । చేపలు పట్టేందుకు వెళితే.. మొసలి పట్టుకుపోయింది..
వరద నీటిలో చేపల వేట కోసం వెళితే.. ఒక మొసలి వచ్చి.. అతడిని గుంజుకుపోయింది. మృతుడిని 30 ఏళ్ల అమిత్ పూనంభాయ్ వసావాగా పోలీసులు గుర్తించారు.

crocodile attack । ఇళ్లను ముంచెత్తడం వంటివే కాకుండా వరద నీటితో (floodwaters) ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. నీళ్లల్లో తేలియాడే చెట్ల మొద్దులు, ఇతర కలప వంటివాటిపై పాములు (snakes) వంటి విష జీవులు కొట్టుకు వస్తుంటాయి. వరద నీరు తగ్గిన తర్వాత మరిన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. అటువంటి ఒక ప్రమాదానికి గురయ్యాడు గుజరాత్లోని వడోదరలో (Vadodara) ఒక కూలీ. వరద నీటిలో చేపల వేట కోసం వెళితే.. ఒక మొసలి (crocodile) వచ్చి.. అతడిని గుంజుకుపోయింది. మృతుడిని 30 ఏళ్ల అమిత్ పూనంభాయ్ వసావాగా పోలీసులు గుర్తించారు. ఇతడు రాజ్పురాకు చెందిన కూలీ. దభాయి ప్రాంతంలో ఆర్సంగ్ నది (Orsang River) ప్రవాహం తగ్గడంతో ఇతడు చేపల వలను అమర్చేందుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతడిపై ఒక మొసలి దాడి చేసి, అతడిని నోటకరచి.. నదిలోకి తీసుకుపోయిందని చెప్పారు. తొలుత మొసలి బారి నుంచి తప్పించకునేందుకు అమిత్ ప్రయత్నించినా.. మొసలి మాత్రం పట్టువీడలేదు.
వడోదరలో మొసళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి నగరం మీదుగా ప్రవహించే విశ్వామిత్రి నదిలో (Vishwamitri River) మొసళ్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వడోదరలో ఉండే మొసళ్లు ముగ్గర్ క్రొకడైల్ (mugger crocodile) జాతికి చెందివి. మార్ష్ క్రొకడైల్స్ అని కూడా వీటిని పిలుస్తారు. ఈ మొసళ్లు పట్టణ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి. నదీ తీరానికి పరిమితమైనా.. అప్పుడప్పుడు నగరంలోకి ప్రవేశించిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. గుజరాత్ వరదలతో (Gujarat floods) ఇప్పటి వరకూ 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వడోదరలో 5వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మంఒత్రి రుషీకేశ్ పటేల్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న మరో 1200 మందిని కాపాడినట్టు చెప్పారు. ఆగస్ట్ 29వ తేదీన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు వరద బాధితుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. వరదల్లో చిక్కుకున్న తమను ఆదుకున్నవారే లేకపోయారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం కోసం కోరినా కొందరు కార్పొరేటర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. కొందరు కార్పొరేటర్లు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని మండిపడుతున్నారు. స్థానికుల ఆగ్రహంతో ఎమ్మెల్యే మనీశా వాకిల్ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.