Gang Rape: దారుణం..మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి!
ఏపీలో మైనర్ బాలికపై ఏడుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. బంధువుల ఇంటికి వచ్చి.. ఒంటరిగా బయటకు వచ్చిన ఒక బాలికను నాలుగు రోజుల పాటు నిర్భంధించి అత్యాచారానికి పాల్పడి..తర్వాత నడ్డిరోడ్డుపై వదిలేశారు.

Gang Rape: సమాజంలో రోజురోజుకు మహిళలు, బాలికల భద్రత ప్రశ్నార్ధకమవుతోంది. చట్టాలు ఎన్ని వచ్చినా..మహిళలు, బాలికలపై దాడులు తగ్గడం లేదు. ఏపీలో మైనర్ బాలికపై ఏడుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. బంధువుల ఇంటికి వచ్చి.. ఒంటరిగా బయటకు వచ్చిన ఒక బాలికను నాలుగు రోజుల పాటు నిర్భంధించి అత్యాచారానికి పాల్పడి..తర్వాత నడ్డిరోడ్డుపై వదిలేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 9న ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరుకు చెందిన బాలిక (14) పక్కింటి మహిళతో కలిసి వీరపనేనిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఈనెల 13న అక్కడ ఒక వివాదం తలెత్తడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన ఓ బాలుడు (15), రజాక్ అనే మరో యువకుడు ద్విచక్రవాహనంపై జి. కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
తర్వాత ఆ అమ్మాయిని వారి స్నేహితులు అనిల్, జితేంద్ర అనే వారి వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. అనంతరం కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరొక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆమెను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేశారు. ఓ ఆటోడ్రైవర్ ఆమెను గమనించి, వివరాలు కనుక్కుని మాచవరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు.
బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండటతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నిందితులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.