Haryana polls । హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ షరతులు ఇవే!

రెండు పార్టీలు తమ వ్యక్తిగత ఆకాంక్షలను పక్కనపెట్టి చేతులు కలిపేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయని రాఘవ్‌ ఛద్దా చెప్పారు. చర్చలు ఇంకా ఒక కొలిక్కి రానప్పటికీ.. సానుకూలంగా సాగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు లాభం కలగని పక్షంలో తాము పొత్తుకు దూరంగా ఉంటామని రాఘవ్‌ ఛద్దా ప్రకటించారు.

Haryana polls । హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ షరతులు ఇవే!

Haryana polls । ఒకవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. పోటీచేసే స్థానాల విషయంలో రెండు పార్టీలు పట్టువీడకపోవడంతో పొత్తులు ఖరారు కాలేదు. వాస్తవానికి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆదివారం వార్తలు వచ్చినా, రెండు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన  మాత్రం రాలేదు. ఐదు సీట్లలో పోటీ చేసేందుకు ఆప్‌ అంగీకరించిందని ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు పార్టీలు తమ వ్యక్తిగత ఆకాంక్షలను పక్కనపెట్టి చేతులు కలిపేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయని రాఘవ్‌ ఛద్దా చెప్పారు. చర్చలు ఇంకా ఒక కొలిక్కి రానప్పటికీ.. సానుకూలంగా సాగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు లాభం కలగని పక్షంలో తాము పొత్తుకు దూరంగా ఉంటామని రాఘవ్‌ ఛద్దా ప్రకటించారు. ‘చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఐక్యతను, హర్యానా ప్రజల డిమాండ్లకు ప్రాధాన్యం ఇస్తూ.. కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాం. పార్టీపరంగా, అభ్యర్థుల వ్యక్తిగత ఆకాంక్షలను పక్కనపెట్టి చర్చలు నిర్వహిస్తున్నాం’ అని రాఘవ్‌ ఛద్దా చెప్పారు.

హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్‌ 12 ఆఖరు తేదీ. ఈ ఎన్నికల్లో ఆప్‌ పది సీట్లు అడుగుతుంటే.. ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీనితోపాటు ఆప్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లే విషయంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంలో కొంత అసమ్మతి ఉన్నట్టు చెబుతున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి ముందే మేం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఉభయులకు లబ్ధి కలగని పక్షంలో మేం దానిని (పొత్తును) వదిలేస్తాం.  చర్చలు జరుగుతున్నాయి. మంచి చర్చలు కొనసాగుతున్నాయి’ అని ఛద్దా తెలిపారు.

ఇదిలా ఉంటే.. హర్యానా ఎన్నికలకు కాంగ్రెస్‌ తన తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌లో ఇటీవలే చేరిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌.. జులానా నుంచి పోటీచేయనున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ హుడా తన గఢీ సంప్లా కిలోయి సీటు నుంచి పోటీకి దిగుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో హర్యానా నుంచి ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్‌ గుప్తా ఒక్కరే పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి నవీన్‌ జిందాల్‌ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల్లో గట్టిగా పోటీనిచ్చేందుకు ఆప్‌ సిద్ధంగా ఉన్నదని ఇటీవల గుప్తా వ్యాఖ్యానించారు.

 

పొత్తు చర్చలు సాగుతుండగానే.. కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ షాక్‌!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఆప్‌ నేతలు 20 మంది పేర్లతో జాబితాను ప్రకటించడం సంచలనం రేపింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆప్‌ పది సీట్లు కోరుతుంటే.. కాంగ్రెస్‌ మాత్రం ఏడు సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. అయితే.. మరిన్ని సీట్ల కోసం పట్టుబడుతున్న ఆప్‌.. చర్చలు తేలకముందే 20 సీట్లకు జాబితా విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కలాయత్‌ నుంచి అనురాగ్‌ ధన్‌ధా, ఉచానా కాలా నుంచి పవన్‌ ఫాజీ, భివానీ నుంచి ఇందు శర్మ, రోహతక్‌ నుంచి బీజేంద్ర హూడాలను ఆప్‌ బరిలో దింపింది.