డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించడం సంచలనం రేపుతుంది.

డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!

విధాత, హైదరాబాద్ : అవినీతి అధికారుల వేటలో తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. వరుసగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అవినీతి అధికారులు, ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. తాజాగా జలమండలి జీఎం అనంతలక్ష్మీ కుమార్ ఏసీబీకి చిక్కగా…అతని వద్ద రూ.100కోట్లుకు పైగానే అక్రమాస్తులు గుర్తించారు. ఈ ఘటన మరిచికపోముందే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించడం సంచలనం రేపుతుంది. 2019- 2023 వరకు వంశీమోహన్ శేరిలింగంపల్లి తహశీల్దారుగా పనిచేశారు. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఏసీబీ తనిఖీ బృందాలు వనస్థలిపురంలోని వంశీమోహన్ నివాసంతో పాటు గుంటూరులోని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.

ఇవాళ ఉదయం నుంచే వంశీమోహన్ కు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరులోని ఆయన మేనమామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారా లేదా అనేదానిపై సోదాల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. వంశీమోహన్​ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ఖాతాల్లో ఉన్న నగదు తనిఖీలలో గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లుగా సమాచారం. ఏక కాలంలో 9చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్​మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని కాజేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ భూమిని తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్​ కు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్​ డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. వంశీమోహన్ నివాసాలతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయ్యాక అక్రమాస్తుల వివరాలు వెల్లడిస్తాం అని ఏసీబీ అధికారులు తెలిపారు.

గతంలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.300 కోట్లకు పైగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాతా రూ.100కోట్ల అక్రమాస్తుల మార్కు దాటిన వారిలో వరుసగా జలమండలి జీఎం అనంతలక్ష్మీ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ ఉండటం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వంశీ మోహన్‌ భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పటి అధికార పార్టీ పెద్దలతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించారని, ఎమ్మెల్సీ కవితను ‘అక్క’అని, కేటీఆర్‌ను ‘అన్న’ అని, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను ‘బావ’ అని పలకరిస్తూ.. ఆ సాన్నిహిత్యంతోనే కీలక పోస్టింగులు దక్కించుకొని, యథేచ్ఛగా పైరవీలు సాగించి అక్రమాస్తులు పోగేసుకున్నట్లుగా ఆరోపణలు చెలరేగాయి.