Komatireddy Rajagopal Reddy| కాంగ్రెస్ లో కాక రేపిన రాజగోపాల్ రెడ్డి ట్వీట్

విధాత : సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం జటప్రోలు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాలమూరు బిడ్డనైన తాను రాబోయే పదేళ్ల వరకు ముఖ్యమంత్రి ఉండటం ఖాయమన్నారు. రాబోయే పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖలను తప్పుబడుతూ రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించబోరని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డికి విభేధాలు ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంత తీవ్ర స్థాయిలో నేరుగా సీఎంను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి. మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రతికూలంగా ఉన్నారని నమ్ముతున్న రాజగోపాల్ రెడ్డి తరుచు రేవంత్ రెడ్డిపై తన అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో వారి మధ్య విభేధాలు రచ్చకెక్కినట్లయ్యింది.