CM Revanth Reddy| 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ
=గ్లోబల్ జీసీసీ రాజధానిగా హైదరాబాద్
=ప్రబుత్వ కృషి ఫలితంగానే ఇది సాధ్యం
=ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి
=గ్లోబల్​కేపబిలిటీ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : 2047 నాటికి తెలంగాణ(Telangana)ను 3 ట్రిలియన్ ఎకానమీ(3 Trillion Economy) గా తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ(Global GCC) రాజధానిగా ఎదిగిందన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని
గ్లోబల్​కేపబిలిటీ సెంటర్​ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబుకు, జయేష్ రంజన్ కు, పాలుపంచుకున్న అధికారులందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇది తెలంగాణ రైజింగ్- 2047 దిశగా వేసిన మరొక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఎలీ లిల్లీ సంస్థ లీడర్ షిప్‌ను, ఉద్యోగులను హైదరాబాద్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు-పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎలీ లిల్లీ నూతన కేంద్రం.. ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను ప్రపంచానికి చాటి చెప్పినట్లేనని చెప్పారు. హైదరాబాద్‌ సదుపాయాల కారణంగా ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్‌కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారిందని తెలిపారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. భారత్‌లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం గర్వకారణమన్నారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందన్నారు. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ కృషి.. ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.