బస్సు-ట్రక్కు ఢీ.. 12 మంది మృతి

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బుధవారం ఉదయం బస్సు ట్రక్కును ఢీకొనడంతో 12 మంది దుర్మ‌ర‌ణం చెందారు

  • Publish Date - January 3, 2024 / 04:32 AM IST
  • మ‌రో 25 మంది వ‌ర‌కు గాయాలు
  • అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం


విధాత‌: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బుధవారం ఉదయం బస్సు ట్రక్కును ఢీకొనడంతో 12 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 25 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. దేర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 5 గంటల ప్రాంతంలో జ‌రిగిన ఈ ప్రమాదంలో బస్సు తుక్కుతుక్క‌యింది.


రెండు వాహ‌నాలు ఎదురెదురుగా బ‌లంగా ఢీకొన‌డంతో వాహ‌నాల దారుణంగా దెబ్బ‌తిన్న‌ట్టు గోలాఘాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేన్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహ‌నాల‌ను ర‌హ‌దారి నుంచి ప‌క్క‌కు త‌ర‌లించి ట్రాఫిక్‌ను క్లియ‌ర్‌చేశారు.


“గోలాఘాట్ జిల్లాలోని కమర్‌బంధ ప్రాంతం నుంచి తిలింగ మందిర్ వైపు ప్ర‌యాణికుల‌తో బ‌స్సు వెళ్తున్న‌ప్పుడు బలిజన్ ప్రాంతంలో బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్ జోర్హాట్ వైపు నుంచి ఎదురుగా వ‌స్తున్న‌ప్పుడు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద స్థ‌లిలోనే ప‌ది చ‌నిపోయారు. మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని డెర్గావ్ సీహెచ్‌సీకి పంపించారు.


కాగా.. గాయపడిన 27 మందిని జోర్హాట్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కు త‌ర‌లించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించారు” అని రాజేన్ సింగ్ చెప్పారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ట్టు తెలిపారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు పేర్కొన్నారు.