న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 1900 చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన అతిథుల దృష్టిని ఆకర్షించాయి ఈ చీరలు.
ఈ చీరలను కర్తవ్య పథ్ నలు మూలల ప్రదర్శించారు. వుడెన్ ఫ్రేమ్స్‌లో పొందుపరిచి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన అనంతరం ఆ చీర ప్రత్యేకత, ఎంబ్రాయిడరీ వర్క్‌తో పాటు ఎక్కడ నేశారు అనే వివరాలు వచ్చాయి. ఇక చీరల వద్ద మహిళలు సెల్ఫీలు దిగారు.
ఈ పరేడ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిసారిగా, భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళా కళాకారులు కవాతును ప్రారంభించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.
చరిత్రలో తొలిసారిగా మహిళా సభ్యులతో త్రివిధ దళాల పరేడ్ కొనసాగింది. నారీశక్తి పేరుతో మహిళా సైనికులు విన్యాసాలు ప్రదర్శించారు. మహిళా పరేడ్‌కు దీప్తి రాణా, ప్రియాంక్ సేవ్‌దా నేతృత్వం వహించారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీకి చెందిన 260 మంది మహిళా సైనికులు పరేడ్‌లో పాల్గొన్నారు.
తొలిసారి బీఎస్ఎఫ్ మహిళా బ్రాస్ బ్రాండ్ ఈ పరేడ్‌లో పాల్గొంది. 300 ఏండ్ల బాంబే శాపర్స్ రెజిమెంట్ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏండ్ల మేజర్ దివ్య త్యాగికి ఈ అవకాశం దక్కింది.