దేశంలో.. 20 న‌కిలీ యూనివ‌ర్సిటీలు

  • Publish Date - October 4, 2023 / 09:29 AM IST
  • న‌కిలీ వ‌ర్సిటీల జాబితాను విడుద‌ల చేసిన యూజీసీ
  • టాప్‌లో ఢిల్లీ, ద్వితీయ‌స్థానంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం
  • న‌కిలీ యూనివ‌ర్సిటీల్లో చేర‌వద్ద‌ని యూజీసీ హెచ్చ‌రిక‌


విధాత‌: భారతదేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉండగా, ఉత్తరప్రదేశ్ నాలుగుతో తర్వాతి స్థానంలో ఉన్న‌ది. డిగ్రీ స‌ర్టిఫికెట్లు ప్రదానం చేసే, మంజూరు చేసే అధికారం లేని కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రుల‌కు అవగాహన కల్పించేందుకు యూజీసీ న‌కిలీ వ‌ర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.


1956 యూజీసీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్టు యూజీసీ దృష్టికి వచ్చింది. ఉన్నత విద్య, ఉపాధి ప్రయోజనాల కోసం ఇలాంటి న‌కిలీ విశ్వవిద్యాలయాలు/సంస్థలు అందించే డిగ్రీలు గుర్తించబడవు/ చెల్లుబాటు కావ‌ని యూజీసీ స్ప‌ష్టంచేసింది. ఉన్నత విద్యకు అడ్మిషన్లు తీసుకొనే ముందు గుర్తింపు పొందిన సంస్థలు, నకిలీ విద్యాసంస్థలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు యూజీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాల‌ని అధికారులు సూచించారు.