15 ఏండ్ల‌కే ప్రేమ వివాహం.. ఐదేండ్ల‌కే భార్య‌ను చంపేశాడు..

ఆ జంట‌ది ల‌వ్ మ్యారేజ్.. ఇద్ద‌రికి 15 ఏండ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది

  • By: Somu    latest    Dec 02, 2023 10:12 AM IST
15 ఏండ్ల‌కే ప్రేమ వివాహం.. ఐదేండ్ల‌కే భార్య‌ను చంపేశాడు..

విధాత‌: ఆ జంట‌ది ల‌వ్ మ్యారేజ్.. ఇద్ద‌రికి 15 ఏండ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఒక బిడ్డ కూడా జ‌న్మించింది. మూడేండ్ల త‌ర్వాత భ‌ర్త ఇత‌ర అమ్మాయిలతో స‌న్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భ‌ర్త‌ను ప్ర‌శ్నించినందుకు ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై న‌గ‌రంలో వెలుగు చూసింది.


కేర‌ళ‌కు చెందిన ఫౌసియా(20) చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న ఓ కాలేజీలో న‌ర్సింగ్ సెకండియ‌ర్ చ‌దువుతోంది. న్యూ కాల‌నీలోని ఓ ప్ర‌యివేటు హాస్ట‌ల్‌లో ఉంటుంది. కేర‌ళ‌లోని కొల్లాంకు చెందిన ఆషిక్‌(20), ఫౌసియా చిన్ననాటి ఫ్రెండ్స్. దీంతో ఇద్ద‌రూ కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఐదేండ్ల క్రితం ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. మూడేండ్ల వ‌ర‌కు అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఆషిక్ ఇత‌ర అమ్మాయిల‌తో సన్నిహితంగా ఉంటున్న‌ట్లు ఫౌసియా గ్ర‌హించింది. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి, జైలుకు త‌ర‌లించారు.


గ‌త కొంత‌కాలం క్రితం ఆషిక్ జైలు నుంచి విడుద‌లై ఫౌసియా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. మ‌ళ్లీ పొర‌పాటు జ‌ర‌గ‌నివ్వ‌ని క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ అప్పుడ‌ప్పుడు క‌లుసుకునేవారు. ఇక మూడో రోజుల క్రితం క్రోమ్‌పేట్‌లోని ఓ హోట‌ల్‌లో ఇద్ద‌రు దిగారు. అత‌ని ఫోన్‌ను ప‌రిశీలించ‌గా, ఇత‌ర అమ్మాయిల‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు క‌నిపించాయి. ఆ ఫోటోల‌పై నిల‌దీయ‌గా, ఆవేశంలో ఫౌసియా గొంతు నులిమి చంపాడు. ఆమె డెడ్‌బాడీ ఫోటోల‌ను వాట్సాప్ స్టాట‌స్‌గా పెట్టుకున్నాడు. దీంతో ఫౌసియా, ఆషిక్ ఫ్రెండ్స్ క‌లిసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.


రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేసు ద‌ర్యాప్తు చేశారు. క్రోమ్‌పేట్‌లోని హోట‌ల్‌లో ఫౌసియా డెడ్‌బాడీ గుర్తించారు. ఆమె మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఫౌసియా, ఆషిక్‌కు ఒక పాప ఉంద‌ని, ఆమెను చిక్‌మ‌గ‌ళూరులో ద‌త్త‌త ఇచ్చార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.