Food Poison | ఆహారం విష‌తుల్యం.. 2000 మందికి అస్వ‌స్థ‌త‌

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగిన మతపర కార్యక్రమంలో భోజ‌నం చేసిన‌ దాదాపు 2,000 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు

  • By: Somu    latest    Feb 07, 2024 10:16 AM IST
Food Poison | ఆహారం విష‌తుల్యం.. 2000 మందికి అస్వ‌స్థ‌త‌
  • వాంతులు, విరేచ‌నాలతో ద‌వాఖాన‌ల్లో చేరిక‌
  • మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లాలో ఘ‌ట‌న‌


విధాత‌: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగిన మతపర కార్యక్రమంలో భోజ‌నం చేసిన‌ దాదాపు 2,000 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజన్‌తో వాంతులు, విరేచ‌నాల‌తో ద‌వాఖాన‌ల్లో చేరారు. ఎవ‌రికీ ప్రాణాపాయం లేద‌ని అంద‌రికి చికిత్స అందిస్తున్నామ‌ని బుధ‌వారం జిల్లా అధికారి తెలిపారు.


అధికారులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లోహా తహసీల్ పరిధిలోని కోష్ట్‌వాడి గ్రామంలో మంగళవారం జరిగిన మతపరమైన కార్య‌క్ర‌మంలో స్థానికులతోపాటు సమీపంలోని సావర్‌గావ్, పోస్ట్‌వాడి, రిసాన్‌గావ్, మాస్కీ గ్రామాల ప్రజలు సాయంత్రం భోజనం చేశారు. వారంతా బుధవారం తెల్లవారుజామున వాంతులు, విరేచ‌నాల‌తో బాధ‌పుడ‌తూ స‌మీప ద‌వాఖాన‌ల్లో చేరారు.


తొలుత అస్వ‌స్థ‌త‌కు గురైన 150 మందిని లోహాలోని ఉప-జిల్లా ద‌వాఖాన‌లో చేర్చారు. తరువాత ఎక్కువ మంది ప్రజలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. 870 మంది రోగులు శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాలతో సహా అనేక ఇతర ఆరోగ్య కేంద్రాల్లో చేరారని అధికారి తెలిపారు. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ద‌వాఖాన‌లో అద‌న‌పు బెడ్లు కూడా ఏర్పాటుచేశామ‌ని వెల్ల‌డించారు. త‌దుప‌రి చికిత్స కోసం రోగుల ర‌క్త న‌మూనాలు సేరిస్తున్న‌ట్టు తెలిపారు.


బాధిత గ్రామాల్లో సర్వే కోసం ఐదు బృందాలను నియమించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రోగుల ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగా ఉన్న‌ద‌ని అధికారులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం కోలుకున్న రోగులను డిశ్చార్జి చేస్తున్నామ‌ని వైద్యులు వెల్ల‌డించారు.