దేశంలో మళ్లీ కరోనా కలకలం.. జేఎన్.1 కేసులు 21 నమోదు
దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆ కేసులు అమాంతం పెరుగుతున్నాయి

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్ కలిగిన కేసులు దేశంలో ఇప్పటి వరకు 21 నమోదైనట్లు తెలుస్తోంది. గోవాలో 19, మహారాష్ట్ర, కేరళలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 21 నమోదైనట్లు సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. జేఎన్.1 వేరియంట్ నివారణకు తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఇవాళ ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలను హెచ్చరించారు. ఈ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ, ఈ మహమ్మారిని నివారించాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మన్సూఖ్ మాండవీయ స్పష్టం చేశారు.