సిక్కిం వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

  • Publish Date - October 4, 2023 / 09:58 AM IST

  • సిక్కింలో 23 మంది సైనికులు గ‌ల్లంతు
  • బుర‌ద‌లో కూరుకుపోయిన ఆర్మీ వాహ‌నాలు
  • కుండ‌పోత వాన‌లు.. ఒక్క‌సారిగా వ‌ర‌ద‌లు
  • వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఆర్మీ సిబ్బంది
  • కొన‌సాగుతున్న స‌హాయ చ‌ర్య‌లు

విధాత‌: ఉత్త‌ర సిక్కింలో కుండ‌పోత వాన‌లు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి క్లౌడ్‌బ‌ర‌స్ట్‌కు లొనాక్‌ సరస్సు ఉప్పొంగ‌డంతో లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో ఒక్క‌సారిగా వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది గ‌ల్లంత‌య్యారు. త‌ప్పిపోయిన సైనికులు వివిధ విభాగాలకు చెందినవారు. వారి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్న‌ట్టు ర‌క్ష‌ణ‌శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) గౌహతి బుధ‌వారం ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

లోయ వెంబడి ఉన్న కొన్ని ఆర్మీ స్థావ‌రాలు వ‌ర‌ద‌కు ప్ర‌భావిత‌మ‌య్యాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిందని ఒక అధికారి తెలిపారు.దీంతో సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు దెబ్బతిన్నాయి. “23 మంది సిబ్బంది వ‌ర‌ద‌లో కొట్టుకుపోయారు. కొన్ని ఆర్మీ వాహనాలు బురదలో మునిగిపోయాయి. స‌హాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి” అని ఆర్మీ అధికారి తెలిపారు.


గ్యాంగ్‌టక్ జిల్లా యంత్రాంగం అక‌స్మాత్తు వ‌ర‌ద‌ల‌పై సమాచారం ఇచ్చింది. “గ్యాంగ్‌టక్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్‌టామ్ పట్టణంలోని తీస్తా నది ప్ర‌వాహం ఇంద్రేణి వంతెన మీదుగా ప్రవహించింది. తెల్లవారుజామున 4 గంటలకు బలూటర్ కు గ్రామం క‌లిపే వంతెన కూడా కొట్టుకుపోయింది” వెల్ల‌డించారు. గ్యాంగ్‌ట‌క్ నుంచి ఉత్తరాన 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుంగ్తాంగ్ పట్టణంలో తీస్తా స్టేజ్ 3 డ్యామ్ ఉంది. హైఅలర్ట్‌తో ఆ ప్రాంతంలోని స్థానికులను ఖాళీ చేయించారు.



మంగన్ జిల్లాలోని డిక్చు వద్ద తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌ను హై అలర్ట్ తర్వాత నీటి విడుదల కోసం తెరిచారు. డ్యామ్ కంట్రోల్ రూమ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. గ్యాంగ్‌టక్‌లోని సింగ్‌టామ్‌లో ఉన్న తీస్తా నదికి సమీపంలో ఉన్న చాలా ఇళ్లను ఖాళీ చేయించారు. అదనంగా, పట్టణంలోని సింగ్‌టామ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో తాత్కాలిక పున‌రావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Latest News