Warangal |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరానికి టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా మరో 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ప్రకటించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన శాసనసభ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని శనివారం మంత్రి నిర్వహించారు. ఇప్పుటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి నగర అభివృద్ధి కోసం మద్దతు అందిస్తుందని తెలిపారు. ఈ 250 కోట్ల రూపాయల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పించాలని కేటీఆర్ కోరారు.
వరంగల్ నగరంలో ఈ మధ్య వచ్చిన వరద సమస్య పైన ప్రత్యేకంగా సమావేశంలో చర్చించారు. భారీ వరదల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన… దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు.
వరద నివారణలో భాగంగా నాలాల అభివృద్ధి… నాలాల పైన ఉన్న అడ్డంకుల తొలగింపును వెంటనే చేపట్టాలని ఆదేశించారు. నాలాలను కబ్జాల వెంటనే తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని… ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు ఒత్తిడిలకు తలగవద్దని అధికారులను ఆదేశించారు.
పేదలను ఒప్పించాలి
కబ్జాల తొలగింపు విషయంలో పేద ప్రజలను ఒప్పించి, వేగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. భవిష్యత్తు వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలని సూచించారు.
వరంగల్ వరదలను అరికట్టేందుకు హైదరాబాదు నగరంలో ఏర్పాటుచేసిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమం మాదిరి ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలని నగర ప్రజాప్రతినిధులు మంత్రిని కోరారు.
హైదరాబాద్లో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా.. గతంలో మాదిరే ఈసారి కూడా అదే స్థాయిలో వర్షం పడినా.. హైదరాబాద్ ప్రజలకు వరదల నుంచి ఎంతో ఉపశమనం కలిగిందని.. ఇదే తీరుగా వరంగల్ నగరానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే ఇలాంటి ఒక ప్రత్యేక నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణను చేయాలని పురపాలక శాఖ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించారు.
ప్రస్తుత పనులపై సమీక్ష
ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతి వివరాలను అధికారుల నుంచి మంత్రి అడిగి తెలుసుకు న్నారు. వరంగల్ నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్ నగరంలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కాలోజీ ఆడిటోరియం వంటి అభివృద్ధి పనులలో జరుగుతున్న జాప్యం పైన మంత్రి కేటీఆర్ స్పందించారు.
వీటిని వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కువ సిబ్బందిని పెట్టి, అధిక షిఫ్టుల్లో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుం దన్న భరోసాను మంత్రి ఇచ్చారు.
ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, శ్రీనివాస రెడ్డి,
ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మరెడ్డి, డాక్టర్ రాజయ్య, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,కూడ చైర్మన్ సుందర్ యాదవ్, ఉన్నతాధికారులు ఎంఎయుడి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి, సీడీఎంఏ పమేలా సత్పతి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా , సంబంధిత అధికారులు హాజరయ్యారు