అడ్రస్ అడిగిన సాధువులను కిడ్నాపర్లు అనుకొని చితకబాదారు..
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు..

కోల్‌కతా : అడ్రస్ అడిగిన పాపానికి ఓ ముగ్గురు సాధువులను కిడ్నాపర్లుగా భావించి చితకబాదారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సాధువులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో గురువారం సాయంత్రం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మకర సంక్రాంతి సందర్భంగా బెంగాల్‌లో గంగసాగర్ మేళా నిర్వహిస్తారు. ఈ మేళాకు ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు సాధువులు బెంగాల్‌కు వచ్చారు. అయితే పురులియా జిల్లాలోని కాసీపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ ముగ్గురు దారి తప్పారు. దీంతో ఓ ఇద్దరు అమ్మాయిలు కనిపించగా, గంగసాగర్ మేళాకు దారేది అని సాధువులు అడిగారు. సాధువులను చూసి భయపడిన అమ్మాయిలు.. స్థానికులకు సమాచారం అందించారు.
దీంతో సాధువులను కిడ్నాపర్లుగా భావించి, స్థానికులంతా గుమిగూడి వారిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సాధువులను దుండగుల దాడి నుంచి రక్షించారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో గంగసాగర్ మేళాకు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాధువులపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.