విధాత: జీతాలు చెల్లించేందుకు నిధుల కొరత నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు రూ.3,000 కోట్లు రుణాలు తీసుకునేందుకు సంస్థల తరపున తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న అప్పులకు అదనంగా మరో 3వేల కోట్ల అప్పుల భారం డిస్కంలపై పడనుంది. ఇటీవల ప్రభుత్వ శ్వేత పత్రం మేరకు డిస్కంల నష్టాలు 78,549కోట్లకు చేరాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 11,500కోట్ల విద్యుత్తు సబ్సిడీ కొనసాగించినా 2024-25లో డిస్కంలకు కొత్తగా మరో 16,632కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. వీటిని అధిగమించాలంటే ఏటా రాష్ట్ర ప్రభుత్వం 31,632కోట్ల సబ్సిడీలు చెల్లించాల్సివుంది. లేదంటే కొత్త అప్పులు.. చార్జీల పెంపు మార్గాలను అనుసరించాల్సిందే. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో విద్యుత్తు సంస్థలకు సబ్సిడీల చెల్లింపు కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో డిస్కలంకు కొత్తగా మరో 3వేల కోట్ల అప్పులకు ప్రభుత్వం అనుమతివ్వడం చర్చనీయాంశమైంది.