లిబియా తీరంలో శరణార్థుల పడవ మునక… 60 మంది మృతి
శరణార్థులతో యూరప్ దేశాల వైపు వెళుతున్న ఓ పడవ సముద్రంలో బోల్తా (Shipwreck ) కొట్టింది. లిబియా (Libya) తీరంలో జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయారు

శరణార్థులతో యూరప్ దేశాల వైపు వెళుతున్న ఓ పడవ సముద్రంలో బోల్తా (Shipwreck ) కొట్టింది. లిబియా (Libya) తీరంలో జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) వెల్లడించింది. ఓడ పైన భారీ అలలు విరుచుకుపడటమే ఈ ప్రమాదానికి కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సమీపంలో ఉన్న పడవలు రెస్క్యూకు వెళ్లి 25 మందిని రక్షించాయి. ప్రమాదానికి గురైన పడవలో ప్రయాణిస్తున్న వారంతా నైజీరియా, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాల వారని తెలుస్తోంది.
అల్లోకల్లోలాలకు నిలయమైన మధ్యధరా సముద్రంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ చాలా మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. కల్లోలిత ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదకర దారిని ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మధ్యధరా సముద్రంలో పడవలు బోల్తా పడి 2,250 మంది కంటే ఎక్కువ మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐఓఎం వెల్లడించింది. ప్రమాదాలతో పాటే ఆఫ్రికా నుంచి యూరప్‌కు వెళుతున్న అక్రమ పడవ ప్రయాణాల సంఖ్యా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాళ్లు ఎక్కువగా లిబియా, ట్యునీషియా దేశాలకు వచ్చి అక్కడి నుంచి యూరప్‌కు ప్రయాణమవుతారు. ఒక్క ఇటలీకే ఈ ఏడాది పడవల్లో లక్షా 53 వేల మంది శరణార్థుల రావడం గమనార్హం.