Snake
విధాత: జనవాసాల్లోకి పాములు తరుచుగా వస్తూనే ఉంటాయి. కానీ ఓ ఇంట్లో మాత్రం పాములు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. ఏకంగా 60 దాకా పాములు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన బీహార్‌లోని రోహతస్ పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రోహతస్ పట్టణంలోని సూర్యాపుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పాము బయట పడింది. ఆ తర్వాత వరుసగా పాములు ఒకదాని తర్వాత మరొకటి బయటకు వచ్చాయి. అలా ఏకంగా 60 పాములు బయటకు వచ్చి.. కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.
ఇంటి యజమాని ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి తెలిపాడు. అనంతరం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పాములను పట్టి, అందులో కొన్నింటిని చంపేశాడు. అయితే, పాములు ఇంకా ఇంట్లో నుంచి వస్తూనే ఉండటంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అధికారులు అక్కడికి చేరుకొని ఆ పాములను పట్టుకున్నారు. ఇంటి గోడలు, ఫ్లోరింగ్ పగులగొట్టి సుమారు 30 పాములను బయటకు తీశారు. కాగా, ఇవన్నీ ఇండియన్ కోబ్రా జాతికి చెందిన పాములని అటవీ అధికారులు తెలిపారు. పాములు ఉన్న ఇంటిని 1955లో నిర్మించినట్లు తెలిపారు.